నటీనటులు: రుహానీ శర్మ, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ
దర్శకత్వం: శ‌్రీధర్ స్వరాఘవ్
సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
సంగీతం: పవన్
నిర్మాతలు: రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి
ఈ శుక్రవారం (జులై 21) బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాల తాకిడి ఎక్కువైంది. చిన్న చిత్రాలు కట్ట కట్టుకుని మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. అందులో ఒకటే ‘హర్’. రుహానీశర్మ కీలక పాత్ర పోషించిన చిత్రమిది. ‘చి.ల.సౌ’ మొదలుకొని పలు సినిమాల్లో తన నటనతో మెప్పించిన రుహానీ ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి ఆ ఆసక్తికి తగ్గట్టుగా సినిమా ఉందా? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హైదరాబాద్ శివార్లలో జంట హత్యలు జరుగుతాయి. ఆ హత్యల వెనక కారణాల్ని నిగ్గు తేల్చేందుకు ACP అర్చనా ప్రసాద్ (రుహానీ శర్మ) రంగంలోకి దిగుతుంది. పలు కోణాల్లో పరిశోధిస్తున్న క్రమంలో కేసు ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఇంతకీ ఆ హత్యల్ని ఎవరు చేశారు? హంతకుల్ని పట్టుకునే క్రమంలో అర్చనకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? మరోవైపు ఆమె NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)లోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? తదితర అంశాలపై స్పష్టత కావాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
కథానాయిక రుహానీశర్మ తన నటనతో ఎప్పటిలాగే ఆకట్టుకుంటుంది. పోలీస్ అధికారిణి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు సినిమాకి బలాన్నిచ్చింది. కథ మెుత్తాన్ని తన భుజాలపై మోస్తూ ఆమె పరిణతి ప్రదర్శించింది. ప్రథమార్ధంలో పాటలో వికాస్ వశిష్టతో కలిసి ఆమె అందంగా కనిపించి మెప్పించింది. జీవన్‌కుమార్ తనదైన నటనతోనూ, తన మార్క్ సంభాషణలతోనూ అక్కడక్కడా నవ్వించారు. ప్రదీప్ రుద్ర మరో పోలీస్ అధికారిగా కనిపించారు. అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
ఎలా సాగిందంటే
‘హిట్’ సినిమా ప్రేరణతో ఈ మూవీని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. జంట హత్యలతో మొదలయ్యే ఈ చిత్రంలో మరో కేస్ కూడా కీలకమే. ఆరంభ సన్నివేశాలు ప్రేక్షకుడిని నేరుగా కథలోకి తీసుకెళతాయి. ఆ తర్వాతే సినిమా గాడి తప్పుతుంది. కేసు పరిశోధనలోనే బలం లేదు. బాధితుల కుటుంబ సభ్యుల్ని, అనుమానితుల్ని కలిసి వివరాలు సేకరించే క్రమం సాగదీతగా అనిపిస్తుంది. ఓ కేస్‌ని నిగ్గు తేల్చేందుకు ఇంత హంగామానా? అనిపిస్తుంది. సినిమాలోని మలుపుల విషయానికొస్తే గతంలో ఎక్కడో చూసిన భావన కల్గుతుంది. దీంతో ఏ దశలోనూ సినిమా ప్రభావం చూపించదు. ఓ పోలీస్ అధికారి పరిశోధిస్తున్న రెండు కేసుల్ని ఒకదానితో మరొకటి ముడిపెట్టిన విధానమే మాత్రం మెప్పిస్తుంది.
డైరెక్షన్ & టెక్నికల్‌గా
దర్శకుడు స్వరాఘవ్ మేకింగ్ మెప్పించినా, ఆయన రాసుకున్న కేసులోనే బలం లేదు. కొన్ని మలుపులున్నా అవి పెద్దగా థ్రిల్‌ని పంచలేవు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం, కూర్పు విభాగాలు చక్కటి పనితీరుని ప్రదర్శించాయి. నిడివి తక్కువ ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చింది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగానే ఉంది.
ప్లస్ పాయింట్స్
- రుహానీ నటన
- సంగీతం
మైనస్ పాయింట్స్
- కథ
- కథనం
- కొత్తదనం లేకపోవడం