• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2023: టీమిండియా ఫ్యూచర్‌ స్టార్స్‌.. ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న యంగ్‌ క్రికెటర్లు 

    టీమిండియాలో స్థానం కోసం ఐపీఎల్‌ ఒక షార్ట్‌కట్‌ వే అని చెప్పొచ్చు. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ క్రికెటర్లను బీసీసీఐ త్వరగా గుర్తించడంతో పాటు, వారికి జాతీయ జట్టులోనూ అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో తమ ప్రదర్శన ఎలా ఉన్నా ఐపీఎల్‌లో రాణించాలని యంగ్‌ క్రికెటర్లు భావిస్తున్నారు. అందుతగ్గట్లే ఈ సీజన్‌లోనూ పలువురు యంగ్‌ క్రికెటర్లు విశేషంగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నారు. బ్యాటు, బంతితో అద్భుత ప్రదర్శన చేస్తూ భారత ఫ్యూచర్‌ స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇంతకీ ఈ సీజన్‌లో రాణిస్తున్న ఆటగాళ్లు ఎవరు? వారి గణాంకాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. 

    1. యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)

    ఐపీఎల్‌ 2023 సీజన్‌లో అదరగొడుతున్న యంగ్ క్రికెటర్లలో యశస్వి జైస్వాల్‌ ముందున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున ఓపెనర్‌గా వస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్‌ 64 బంతుల్లోనే 124 పరుగులు బాదాడు. ఈ ఇన్సింగ్స్‌తో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక రన్స్‌ చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా జైస్వాల్‌ నిలిచాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్‌ 160 స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 477 పరుగులు చేశాడు. ఇందులో 62 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ యువ క్రికెటర్‌ ప్రతిభను మెచ్చుకుంటున్న పలువురు మాజీలు.. జాతీయ జట్టులోకి రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. 

    2. రింకూ సింగ్‌ (Rinku Singh)

    ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రింకూ సింగ్ ఓ సంచలనమనే చెప్పాలి. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరపున బరిలోకి దిగుతున్న రింకూ సింగ్.. పోయిందనుకున్న మ్యాచ్‌లను కూడా తన అద్భుతమైన ప్రదర్శనతో విజయ తీరాలకు చేరుస్తున్నాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన రింకూ సింగ్.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులోనూ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి KKRను గెలిపించాడు. KKR తరపున 11 మ్యాచ్‌లు ఆడిన రింకూ 337 పరుగులతో అందరికంటే ముందున్నాడు. 151.12 స్ట్రైక్‌రేట్‌తో ఈ పరుగులు సాధించాడు. 

    3. తిలక్‌ వర్మ (Tilak Varma)

    ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ కూడా ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన తిలక్‌, గత సీజన్‌లో చూపించిన అద్భుత ఫామ్‌నే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన తిలక్‌ 158.38 స్ట్రైక్‌రేట్‌తో 274 పరుగులు చేశాడు. గత సీజన్‌లో మొత్తం 397 పరుగులు చేసి సత్తా చాటాడు. తిలక్‌ ఆటను చూసిన మాజీ క్రికెటర్లు ‌అతడు టీమ్‌ఇండియాకు ప్రధాన బలంగా మారతాడని విశ్లేషిస్తున్నారు. 

    4. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)

    చెన్నై సూపర్‌ కింగ్స్ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సైతం ఈ సీజన్‌లో ఆకట్టుకుంటున్నాడు. తన బ్యాటింగ్‌తో CSK విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రుత్‌రాజ్‌ 148.26 స్ట్రైక్‌రేట్‌తో 384 పరుగులు సాధించాడు. ఈ ఐపీఎల్‌ తర్వాత రుత్‌రాజ్‌ తిరిగి టీమ్‌ఇండియా తరపున బరిలోకి దిగుతాడని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

    5. సాయి సుదర్శన్‌ (Sai Sudarshan)

    ఐపీఎల్‌లో అదరగొడుతున్న యంగ్‌ క్రికెటర్లలో సాయి సుదర్శన్ ఒకరు. తమిళనాడుకు చెందిన ఈ ఆటగాడు గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌లో మెుత్తం 10 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్‌.. 40.13 యావరేజ్‌తో 321 పరుగులు చేశాడు. అతి త్వరలోనే టీమ్‌ఇండియా తలుపు తట్టే యంగ్‌ క్రికెటర్లలో సాయి సుదర్శన్ కచ్చితంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. 

    6. శివం ధూబే (Shivam Dube)

    చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్‌ శివం ధూబే సైతం గత సీజన్‌ నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో ధూబే మునుపటి యువరాజ్‌ను గుర్తుచేస్తున్నాడని క్రికెట్‌ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ధూబే 156.76 స్ట్రైక్‌రేట్‌తో 290 రన్స్‌ చేశాడు. ఇందులో ఏకంగా 24 సిక్సులు ఉన్నాయి. 

    7. తుషార్‌ దేశ్‌పాండే (Tushar Deshpande)

    ఈ ఐపీఎల్‌లో విశేషంగా రాణిస్తున్న యంగ్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే ముందువరుసలో ఉన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 19 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పర్పుల్‌ క్యాప్‌ రేసులో నిలిచాడు. అయితే పరుగులు దారళంగా ఇస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ధోని గైడెన్స్‌లో అతడు ప్రతీ మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తుండటం విశేషం

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv