ప్రజా గాయకుడు గద్దర్ (74) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు. అయిదే గద్దర్ గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియనప్పటికీ కిందటి తరం వారికి ఆయన గొప్ప విప్లవకారుడు. ముఖ్యంగా ఆయన స్వరం ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది. ఆయన సాహిత్యం.. పౌరులను ఆలోచింపజేస్తుంది. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలను నడిపించిన గొప్ప ధీశాలి గద్దర్. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ గద్దర్ తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్ ఎందుకంత స్పెషల్. ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాటలు ఏవి? ఈ కథనంలో చూద్దాం.
బండెనక బండి కట్టి
గద్దర్ పాడిన వాటిలో ‘బండెనక బండి కట్టి’ అనే పాట చాలా స్పెషల్. ‘మా భూమి’ సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ఈ సాంగ్‌తో గద్దర్ ఒక్కసారిగా అందరిలో దృష్టిలో పడ్డారు.
మల్లెతీగకు పందిరివోలె
1995లో వచ్చిన ‘మల్లె తీగకు పందిరివోలె’ పాట సైతం గద్దర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ పాటను గద్దర్ స్వయంగా రాశారు. ఈ సాంగ్ ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని సైతం సొంతం చేసుకుంది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన ‘ఒరేయ్ రిక్షా’ సినిమాలోనిది ఈ పాట.
పొడుస్తున్న పొద్దుమీద
గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఈ పాట విన్న ఎంతో మంది యువకులు ఉద్యమం వైపు నడిచారు. ఈ పాటకు గాను బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీలో గద్దర్ నంది అవార్డు అందుకున్నారు. ‘జై బోలో తెలంగాణ’ అనే సినిమాలోనిది ఈ సాంగ్.
నా రక్తంతో నడుపుతా
ఓరేయ్ రిక్షా సినిమాలోని ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట కూడా అప్పట్లో ఎంతగానో పాపులర్ అయ్యింది. గద్దర్ ఆవేశంతో రాసిన లిరిక్స్‌కు అంతకు మించిన నటనతో ఆర్. నారాయణమూర్తి రక్తి కట్టించారు.
అమ్మ తెలంగాణా
తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేస్తూ ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ అనే పాటను రాశారు. తన స్వరంతో ఆ సాంగ్‌కు ప్రాణం పోశారు. ఇది విన్న తెలంగాణ ప్రజలు కదం తొక్కారు. ఉద్యమం వైపు కాలు కదిపారు. ఈ పాటను రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం విశేషం.
మరిన్ని పాటలు
పైన పేర్కొన్న పాటలతో పాటు ‘అడవి తల్లికి వందనం’, ‘పొద్దు తిరుగుడు పువ్వా’, ‘భద్రం కొడుకో’, ‘జం జమలబరి’, ‘మేలుకో రైతన్న’ లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది నిజం.