నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు
దర్శకుడు: అంజి కె మణిపుత్ర
సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి
నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ నటించిన రెండో చిత్రం ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో తన సెకండ్ హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ‘ఆయ్’ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా చేసింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
అమలాపురంకు చెందిన కార్తీక్ (నార్నే నితిన్) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరతాడు. కరోనా లాక్డౌన్ వల్ల ఊరికి వస్తాడు. ఇంటి నుంచి పని చేసుకుంటూనే బాల్య మిత్రులు హరి, సుబ్బుతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ని ప్రేమిస్తాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పల్లవికి కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్ తన కులం వాడేనని భావించి ఇష్టపడుతుంది. అతడి కులం వేరని తెలిసి దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరిస్తుంది. దీంతో కార్తీక్ తట్టుకోలేకపోతాడు. మరోవైపు వారిద్దరిని కలిపేందుకు స్నేహితులు హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఫలిచిందా? పల్లవితో కార్తీక్ పెళ్లి జరిగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
కార్తీక్ పాత్రలో నార్నే నితిన్ ఆకట్టుకున్నాడు. మెుదటి చిత్రంతో పోలిస్తే నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రే అతడికి దక్కింది. హావభావాలు, సంభాషణల్లో అతనిలో పరిణతి కనిపించింది. డ్యాన్స్ తోనూ మెప్పించాడు. ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అచ్చమైన గోదావరి అమ్మాయిగా తెరపై సందడి చేసింది. ఫ్రెండ్స్ పాత్రల్లో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయ చేసిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా కసిరెడ్డి పాత్ర ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. మైమ్ గోపి, వినోద్ కుమార్‌లు పాత్రల పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అంజి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్ చేసిన తీరు మెప్పిస్తుంది. అమలాపురం నేపథ్యం, చిన్ననాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, ఆప్యాయతలు ఇలా అన్నింటీని మేళవిస్తూ కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచి సినిమాలో సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా కార్తిక్ ప్రేమలో పడినప్పటి నుంచి కథ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. హీరో ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. సాఫీగా సాగిపోతున్న కథలో ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు డైరెక్టర్. సెకండాఫ్‌లో ఇరు కుటుంబాల పెద్దలను ఇన్వాల్వ్ చేసి మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్ప్రైజ్ చేస్తుంది. అయితే రొటీన్ స్టోరీ, లవ్‌ట్రాక్‌ను కామెడీ డామినేట్ చేయడం, లాజిక్ లేని సన్నివేశాలు మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సమీర్ కళ్యాణి కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యాన్ని తన కెమెరాతో చూపించిన తీరు మెప్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల అందించిన సూఫియానా పాట ఎంతో వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ్యుసర్లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
- నటీనటులు
- కామెడీ
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
- రొటిన్ స్టోరీ
- ఊహకందేలా సాగే కథనం
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!