నటీనటులు: చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, యష్ రంగినేని
దర్శకత్వం: చెందు ముద్దు
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
ఛాయాగ్రహణం: పంకజ్ తొట్టాడ
నిర్మాత: యష్ రంగినేని
‘30 Weds 21’ ఫేమ్ చైతన్యరావ్ హీరోగా, లావణ్య హీరోయిన్‌గా చేసిన తెరకెక్కిన చిత్రం ‘ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ’. ఓ పిట్ట కథ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన చెందు ముద్దు తన రెండో ప్రయత్నంగా ఈ మూవీ తెరకెక్కించాడు. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రేమ సాగుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మంచి ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంది?. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? చైతన్యరావ్‌కు హిట్ తెచ్చిపెట్టిందా? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
కథేంటి
కపిలేశ్వరపురం అనే పల్లెటూరులో చంటి (చైతన్య రావ్) తన స్నేహితుడితో కలిసి ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నడుపుతుంటాడు. జ్యోతిష్యుడైన తన తండ్రికి చుట్టు పక్కల ఎంతో మంచి పేరు ఉంది. కానీ చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఎగతాళి చేస్తుంటారు. ఇంతలోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి చంటి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్టపడుతుంది. ఇక ఈ ఇద్దరి ప్రేమకథ కంచికి చేరినట్టే అనుకునేలోపే విషయం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌతమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చంటి ఓ హత్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు? ఆత్మహత్యకి ఎందుకు ప్రయత్నించాడు? చంటి, గౌతమి ఒక్కటయ్యారా లేదా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
చైతన్యరావ్ నటన ఆకట్టుకుంటుంది. వయసు మీదపడిన కుర్రాడిగా తనకి అలవాటైన పాత్రలో మరోసారి ఆకట్టుకున్నారు. వింటేజ్ లుక్‌లో ఆయన కనిపించిన తీరు, గోదావరి యాస, కామెడీలో టైమింగ్ మెప్పిస్తాయి. లావణ్య అచ్చమైన తెలుగమ్మాయిగా అందంగా కనిపించింది. ఆమె నటన కూడా బాగుంది. చెల్లెలు పద్దు పాత్రలో ఉత్తర, స్నేహితుడిగా లలిత్ ఆదిత్య, మరో పాత్రలో మిహిరా మంచి అభినయం ప్రదర్శించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఎప్పుడూ తింటూ కనిపించే వైవా రాఘవ పాత్ర కూడా బాగా నవ్విస్తుంది. కొత్త నటులతో దర్శకుడు సహజమైన నటనని రాబట్టుకున్నారు
ఎలా సాగిందంటే
కథానాయకుడి ఆత్మహత్య ప్రయత్నంతో కథ మొదలుపెట్టాడు దర్శకుడు. అక్కడ దొరికిన లేఖ నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. అలాగే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ పూర్తిస్థాయిలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగుతూ ఇంటర్‌వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
డైరెక్షన్ & టెక్నికల్‌గా
1980నాటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కల్మషం లేని పాత్రలు, అందమైన విజువల్స్, సంగీతం ప్రేక్షకులను హత్తుకుంటాయి. మాటలతో అక్కడక్కడా మెరిపించినా.. కథ, కథనాల రచనలో ఆయన మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. 80వ దశకం కథను చెప్పె క్రమంలో అప్పటి సినిమాలను అనుసరించి స్టోరీని తెరకెక్కించడం అంతగా రుచించదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. పల్లెటూరి అందాల్ని తెరపై ఆవిష్కరించిన తీరు శభాష్ అనిపిస్తుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది. కథలో వేగం పెరిగేలా ఎడిటింగ్ విభాగం మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.
ప్లస్ పాయింట్స్
- 1980 నాటి నేపథ్యం
- నటీనటులు
- కథలో మలుపులు
మైనస్ పాయింట్స్
- ఎడిటింగ్
- పాత పంథాలో సన్నివేశాలు