• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?

    నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు

    దర్శకత్వం: సముద్రఖని

    స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్

    మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్

    సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్

    నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల

    పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే?

    మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే.

    ఎలా ఉంది?

    ‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్‌ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు.

    ఎవరెలా చేశారు?

    కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు.

    టెక్నికల్‌గా

    సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి.

    ప్లస్ పాయింట్స్

    పవన్, సాయితేజ్ మధ్య సీన్స్

    పవన్ సాంగ్స్ మిక్స్

    డైలాగ్స్, స్క్రీన్ ప్లే

    క్లైమాక్స్

    మైనస్ పాయింట్స్

    ఓవర్ సీన్స్

    పొలిటికల్ డైలాగ్స్

    చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’

    రేటింగ్: 3/ 5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv