• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

    టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్‌, గుండె, డయాలసిస్‌ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్‌ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్‌ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. 

    కుటుంబ నేపథ్యం

    చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. 

    సినిమా నేపథ్యం

    చంద్రమోహన్‌ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్‌ రాబర్ట్ రహీమ్‌’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు.

    చంద్రమోహన్‌ మెచ్చిన చిత్రాలు

    సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్‌ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు.

    లక్కీ హీరోగా గుర్తింపు

    ఒకప్పుడు చంద్రమోహన్‌ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్‌ అయినా నటిస్తే సినిమా హిట్‌ అవ్వాల్సిందే. అలా కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్‌ అందుకున్నారు. చంద్రమోహన్‌-సుధ కాంబినేషన్‌ అయితే సూపర్‌హిట్‌ అయింది. అటు చంద్రమోహన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్‌.

    సంపాదనలో శూన్యమే!

    చంద్రమోహన్‌ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్‌ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్‌ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్‌ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం  రూ.30 కోట్లపైనే. శంషాబాద్‌ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.  

    చెయ్యి చాలా మంచిదట!

    చంద్రమోహన్‌ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్‌ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్‌ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv