తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ క్రమంలో వివిధ పరీక్షలను రద్దు చేయటంతో పాటు కొన్నింటిని వాయిదా వేస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల క్రితం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షతో పాటు AEE, డీఏఓ ఎగ్జామ్స్‌ను రద్దు చేశారు. జూనియర్ లెక్చరర్స్ సహా మరికొన్నింటిని వాయిదా వేశారు.
రద్దుకే మెుగ్గు
టాన్ ప్లానింగ్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, AEE ప్రశ్నాపత్రాలు లీకైనట్లు గుర్తించిన టీఎస్పీఎస్సీ… సిట్ సమర్పించిన నివేదికపై క్షుణ్ణంగా చర్చించింది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్న కమిషన్ గ్రూప్ 1 పైనా అనుమానాలు వస్తుండటంతో గతేడాది అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమ్స్‌తో పాటు జనవరి 22న AEE, ఫిబ్రవరి 26న జరిగిన DAO పరీక్షలను కూడా రద్దు చేశారు. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు.
వాయిదాలు
వివిధ పోటీ పరీక్షలను కూడా రీ షెడ్యూల్ చేసింది టీఎస్పీఎస్సీ. జూనియర్ లెక్చర్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు. ఫలితంగా మరికొన్నింటి షెడ్యూల్స్ కూడా మారవచ్చు. దీంతో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎప్పుడూ ఏ వార్త వింటామో తెలియక సతమతమవుతున్నారు.
నిందితులకు కస్టడీ
ఈ కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. వారిని విచారించేందుకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం 6 రోజులకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న 9 మందిని రేపు ఉదయం 10.30 గంటలకు కస్టడీకి తీసుకొని సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. నిందితుల నుంచి కీలకమైన ఆధారాలు సేకరించవచ్చని భావిస్తున్నారు.
హోరెత్తిన నిరసనలు
పేపర్ లీకేజీ వ్యవహారంపై గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. నిరసన ముగిసే సమయానికి టీఎస్పీఎస్స కార్యాలయానికి వెళ్తామని సంజయ్ ప్రకటించారు. అక్కడ్నుంచి బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా… తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్‌ను అరెస్ట్ చేశారు.
అటు లక్డీకపూల్ బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్.
కేటీఆర్ ఫైర్
లీకేజీ కేసుకు సంబంధించి బండి సంజయ్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు మంత్రి కేటీఆర్. “ బండి సంజయ్ ఓ దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహన లేదు. TSPSC ఓ స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థ. ఓ వ్యక్తి చేసిన నేరాన్ని సంస్థకు ఆపాదించడం సరికాదు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్‌ను నాశనం చేసేలా చేస్తున్నారు” అని విమర్శించారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం