Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్‌..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్‌..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!

    Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్‌..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!

    June 25, 2024

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా కోసం యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురువారం (జూన్‌ 27) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా.. హాట్‌ కేకుల్లా టికెట్స్‌ అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్స్ రావడంతో అన్ని థియేటర్స్‌లో టికెట్ ధరలు భారీగా పలుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జోరుగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టికెట్ల అమ్మకాల్లో కొన్ని థియేటర్లు అనుసరిస్తున్న వైఖరి వివాదస్పదమవుతోంది. దీనిపై ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

    ఫ్యాన్స్ అసంతృప్తి ఎందుకంటే?

    కల్కి సినిమాపై ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని థియేటర్లు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్స్‌ అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నా.. బుక్‌ చేసుకునేందుకు వీలుపడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘బుక్‌మై షో’.. థియేటర్లలో టికెట్స్ ఉన్నట్లు గ్రీన్‌ కలర్‌లో షోవారిగా టికెట్స్‌ను చూపిస్తున్నాయి. అయితే వాటిని క్లిక్‌ చేస్తే అభిమానులకు ‘Sorry! Something is not right’ సందేశం వస్తోంది.దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్‌ను బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చన్న ఉద్దేశంతోనే థియేటర్‌ యాజమాన్యాలు ఇలా చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఓ వైపు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళన ఉన్నప్పటికీ అభిమాన హీరో అయినందువల్ల బుకింగ్స్‌ కోసం ట్రై చేస్తున్నట్లు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ.. థియేటర్ యాజమన్యాల కక్కుర్తి చర్యలు.. అసహనానికి గురిచేస్తున్నాయని మండిపోతున్నారు. ఇలా చేస్తే భవిష్యత్‌లో థియేటర్లకు రావాలన్న ఆసక్తి కూడా సన్నగిల్లుతుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. 

    రూ.1000 కోట్ల క్లబ్‌లో..

    ఇదిలా ఉంటే.. కల్కి సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సాధారణంగా ఏదైనా స్టార్‌ హీరో సినిమా అంటే టైర్‌-1 సిటీస్‌లో ఎక్కువగా అడ్వాన్స్‌ బుకింగ్స్ జరుగుతుంటాయి. కానీ, కల్కికి మాత్రం టైర్‌-2 సిటీస్‌లోనూ జోరుగా టికెట్స్‌ బుక్‌ అవుతున్నాయి. నగరవాసులు మాత్రమే కాకుండా చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలోని ప్రేక్షకులు సైతం కల్కి చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజున ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే ‘కల్కి’ ఈజీగానే రూ.1000 కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు. 

    ఫస్ట్‌డే టార్గెట్‌ ఎంతంటే?

    గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి 2’ (Bahubali 2) సినిమా మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే రాజమౌళి తదుపరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కూడా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. ‘బాహుబలి 2’ తర్వాత మరోసారి ఆ మార్క్‌ను ప్రభాస్ టచ్ చేయలేకపోయాడు. గత ఏడాది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘సలార్’ కూడా తొలిరోజు రూ.200 కోట్లు రాబట్టలేకపోయింది. దీంతో ప్రభాస్ ‘కల్కి’ ఫస్ట్ డే టార్గెట్ రూ.200 కోట్లు పైనే అని తెలుస్తోంది. రాజమౌళి బ్రాండ్‌తో సంబంధం లేకుండా ప్రభాస్‌ సోలోగా రూ.200 కోట్లు కొల్లగొడతాడా? లేదా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రభాస్‌ ఈ ఫీట్‌ సాధిస్తే.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కల్కి’ నిలవడం ఖాయమని చెప్పవచ్చు. 

    టికెట్ రెట్లు పెంపు

    కల్కి టికెట్‌ ధరలు పెంపునకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్స్‌ పెంపునకు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జూన్‌ 27 నుంచి జులై 4 వరకూ సింగిల్ స్క్రీన్‌పై రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకూ పెంచుకోవచ్చని సూచించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కల్కి టీమ్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సింగిల్ స్క్రీన్‌లకి రూ.75, మల్టీప్లెక్స్‌లకి రూ.125 వరకూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అంతేకాక అదనపు షోలకి కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రతి థియేటర్‌లో 5 షోలు వేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్‌ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే సగటున ఒక్కో టికెట్‌కు రూ.500 (ట్యాక్స్‌లతో కలిపి) వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అదే సింగిల్‌ స్క్రీన్స్‌లో అయితే రూ.200-300 వరకూ పెట్టాల్సిందే. ఫ్యామిలీ అంతా సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోందని కొందరు నెటిజన్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. 

    ఒక్కో టికెట్‌ రూ.3 వేలు..!

    కల్కి సినిమా ప్రభావం నార్త్‌లోనూ గణనీయంగా కనిపిస్తోంది. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ చిత్రాన్ని చూసేందుకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తికనబరుస్తున్నాయి. దీన్ని గమనించిన థియేటర్‌ వర్గాలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ముంబయిలో కల్కి అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్‌.. భారీ ధర పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మల్టీప్లెక్స్ లలో కల్కి సినిమా ఒక్కో టికెట్ ధర రూ.2000 రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్స్‌లో అయితే ఏకంగా రూ. 3000 రూపాయలకు విక్రయిస్తున్నారట. ఢిల్లీ మల్టీప్లెక్స్‌లో రూ.1300 నుంచి రూ.2000 వరకు టికెట్ రేట్లు ఉన్నట్లు సమాచారం. అటు బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్‌ ధర రూ.1100-1500 వరకు ఉన్నాయని సమాచారం. ఇక హైదరాబాద్‌లో బెనిఫిట్ షోకి రూ.3000 వరకూ టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్నారని టాక్. 

    అక్కడ కల్కి రికార్డ్‌ షోస్..

    హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభం అయిన అపర్ణ మల్టీప్లెక్స్‌లో తొలిరోజున కల్కి కోసం ఏకంగా 47 షోలు ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాకుండా అన్ని షోలకు సంబంధించిన టికెట్స్‌ సైతం ఇప్పటికే అమ్ముడి పోయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్‌  పోస్టర్‌ను సైతం వారు రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్‌ సినిమా అంటే ఆమాత్రం ఉంటుందని కొందరు పోస్టులు పెడుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version