ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే జట్టులోకి తిరిగి రానున్నాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌కి వీడ్కోలు పలికిన బెన్ స్టోక్స్ తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ కోరిక మేరకు బెన్ స్టోక్స్ తిరిగి జట్టుతో చేరుతున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో బెన్ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే. దీంతో స్టోక్స్ రాకతో ఇంగ్లాండ్ జట్టు మరింత బలంగా మారింది. అయితే, ఇలా రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్ తీసుకున్న ఆటగాళ్లు ఎవరు? ఇండియా టీమ్‌లో కూడా ఇలా వెనక్కి వచ్చే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
ధోనీ రావాల్సిందే..
భారత జట్టు మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీ 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ కెరీర్‌కి వీడ్కోలు పలికి కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతూ వస్తున్నాడు. ఈ ఏడాది చెన్నై జట్టుకి కప్‌ని అందించి తనలో పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. తాజాగా, బెన్ స్టోక్స్ వన్డే జట్టులోకి తిరిగి రావడంతో ధోనీ కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. భారత జట్టును వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సమస్య వేధిస్తున్నందున ధోనీ ఈ స్థానాన్ని భర్తీ చేయగలడని చెబుతున్నారు. రిషబ్ పంత్ లేమితో ఇండియాకు మరో వికెట్ కీపర్ కరవయ్యాడు. ఈ ప్లేసులో స్థిరంగా రాణించే బ్యాట్స్‌మన్ కనిపించట్లేదు. పైగా, మైదానంలో ధోనీ అందించే విలువైన సలహాలు, సూచనలు.. జట్టుకు ఎంతో ఉపయోగ పడతాయని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ కోరిక ఎలాగున్నా.. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ధోనీ తిరిగి జట్టులోకి రాకపోవచ్చేమో.
అంబటి రాయుడు
వన్డే జట్టులోకి అంబటి రాయుడిని తీసుకోవాలనే వాదన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే రాయుడు తన క్రికెట్ కెరీర్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలోనూ రాయుడు రిటైర్మెంట్ అనౌన్స్ చేసి యూ టర్న్ తీసుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో రాయుడు సరిగ్గా రాణించగలడు. ప్రస్తుతం ఈ స్థానంలో స్థిరమైన బ్యాటర్ కోసం భారత్ ఎంతగానో ఎదురు చూస్తుంది. ఒకవేళ రాయుడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటే ఈ స్థానంలో అవకాశం దక్కుతుండొచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదెంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
వస్తే తీసుకుంటారా?
ప్రస్తుతం టీమిండియాకు మెండైన వనరులు ఉన్నాయి. అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతిభ చూపిస్తున్నప్పటికీ జట్టుగా రాణించడంలో భారత్ విఫలమవుతూ వస్తోంది. అందుకే, పలు దఫాలుగా ప్రయోగాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో నిర్దిష్ట స్థానాల కోసం ప్లేయర్లను ఎంపిక చేసే వేటలో బీసీసీఐ పడింది. పేసర్లను వెలికి తీయడానికి టాలెంట్ హంట్ అనే ప్రోగ్రామ్ని చేపట్టింది. ఇలా జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రిటైర్మెంట్ తీసుకున్న ప్లేయర్లకు చోటు దక్కుతుందన్న వాదనలో అర్థం లేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఐడియా సాధ్యం కాకపోవచ్చు.
రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నది వీరే..
భారత ప్లేయర్ మనోజ్ తివారీ జులై నెలలో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అంబటి రాయుడు సైతం గతంలో ఇదే విధంగా చేశాడు. ఇలా ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించాక వెనక్కి వచ్చిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరూ చేరిపోయారు. ఇతర దేశాల క్రికెటర్లు సైతం ఇలా వెనక్కి వచ్చారు.
మొయిన్ అలీ
ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ 2021 సెప్టెంబర్‌లో టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. పని భారం కారణంగా వైట్ బాల్ క్రికెట్(టీ20, వన్డే) క్రికెట్‌పై ఫోకస్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఈ ఏడాది జూన్‌లో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. యాషెస్ టెస్ట్ సిరీస్ ఆడేందుకు తాను జట్టులోకి వస్తున్నానని ప్రకటించాడు. ఈ సిరీస్ అనంతరం తిరిగి టెస్టు క్రికెట్‌కి రిటైర్మెంట్ అనౌన్స్ చేసి మళ్లీ ఆశ్చర్యపరిచాడు.
వీరు కూడా..
బంగ్లాదేశ్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్; పాకిస్థాన్ ఆటగాళ్లు షాహీద్ ఆఫ్రిదీ, ఇమ్రాన్ ఖాన్; ఇంగ్లాండ్ ప్లేయర్ కెవిన్ పీటర్సన్, వెస్టిండీస్ ఆటగాళ్లు డ్వేన్ బ్రావో, కార్ల్ హూపర్; జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్, తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.