నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు
డైరెక్టర్ : బాల రాజశేఖరుని
సంగీతం : కల్యాణి మాలిక్
నేపథ్య సంగీతం : ఆర్.పి పట్నాయక్
నిర్మాత : కేకేఆర్, బాలరాజు
విడుదల తేదీ: 21 జూన్, 2024
చైతన్యరావు (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah Patel) ఫస్ట్ టైమ్ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుందా? చైతన్యరావు, హెబ్బాపటేల్‌కు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
ఇషాన్ (చైతన్య రావు), సోనాలి(హెబ్బా పటేల్) ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే వీళ్లిద్దరి ఆలోచన విధానం వేర్వేరుగా ఉంటాయి. సోనాలి చాలా ఫాస్ట్ అయితే.. ఇషాన్ నిదానం. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఏదోక సమస్యలు వస్తుంటాయి. ఓ రోజు వీరికి సీనియర్ కపుల్స్ పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే గేమ్ గురించి చెబుతారు. అలా వారిని ఓ రిసార్ట్‌కు పంపిస్తారు. ఇంతకీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అంటే ఏంటి? దాని వల్ల ఇషాన్ – సోనాలి మధ్య గొడవలు సద్దుమణిగాయా? వీరి శృంగార జీవితం బాగుపడిందా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
కొన్ని రోజులుగా వరుస చిత్రాలతో అలరిస్తున్న చైతన్య రావు.. ఈ సినిమాలోనూ చక్కటి నటన కనబరిచాడు. రెండు వేరియేషన్స్‌లో నటించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ మరోమారు తన అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వీరి మధ్య కెమెస్ట్రీ యూత్‌ను మెప్పిస్తుంది. సీనియర్ జంటగా తనికెళ్ల భరణి, సుహాసిని ఎప్పటిలాగే తమ సెటిల్డ్ నటనతో అలరించారు. థియేటర్లలో నవ్వులు పూయించారు. కథ మెుత్తంగా ప్రధానంగా ఈ నలుగురు మధ్యే సాగడం గమనార్హం. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పెళ్లైన కొత్త జంట కొద్ది రోజులకే విడిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. యువ జంటలు చిన్న చిన్న పొరపొచ్చాలకే విడాకుల వరకూ వెళ్తున్నారు. ఈ అంశాన్నే కథాంశంగా తీసుకొని దర్శకుడు బాల శేఖరుని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకోవాలన్న సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కథ చెప్పే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంటూ కథను ఎటెటో తీసుకెళ్లి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశారు. యూత్‌ను అట్రాక్ట్ చేస్తూ తీసిన కొన్ని సీన్లు మరీ బోల్డ్‌గా అనిపిస్తాయి. వల్గారిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. తమ జీవితాన్ని బాగు చేయడానికి వాళ్లే ఫ్యూచర్ నుంచి రావడం అనేది కాస్త కొత్తగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ అందించిన పాటలు బాగున్నాయి. ఆర్.పి పట్నాయక్ అందించిన నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన పనిని ఇంకాస్త బెటర్‌గా నిర్వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
- చైతన్య రావు, హెబ్బా పటేల్ నటన
- సమకాలిన అంశాలు ఉండటం
- సంగీతం
మైనస్ పాయింట్స్
- కథనం, స్క్రీన్‌ప్లే
- సాగదీత సన్నివేశాలు