భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఊపందుకుంది. పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థలు అధునాతన ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఏథర్ 450 అపెక్స్ పేరుతో ఈవీ స్కూటీని తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
టచ్ స్కీన్
ఈ నయా ఈవీ స్కూటీకి 17.7 సెం.మీ TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు . గూగుల్ మ్యాప్ నావిగేషన్ సదుపాయం కూడా దీనికి అందించారు. అలాగే బ్యాటరీ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ఈ డిస్‌ప్లే ద్వారా తెలుసుకోవచ్చు.
బ్యాటరీ సామర్థ్యం
ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.7 Kwh బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇది సింగిల్ ఛార్జ్‌తోనే 157 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీంట్లో మొత్తం 5 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. గత మోడళ్లలో ఇచ్చిన వ్రాప్ మోడ్ స్థానంలో కొత్తగా వ్రాప్ ప్లస్‌ను పరిచయం చేశారు.
గరిష్ట వేగం
ఈ స్కూటర్ 2.09 సెకన్స్‌లోనే 0 నుంచి 40 kmph వేగం అందుకుంటుంది. గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఐదేళ్లు లేదా 60 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీని కలిగి ఉంది.
మ్యాజిక్ ట్విస్ట్
Ather 450 Apexలో ‘మ్యాజిక్ ట్విస్ట్’ అనే అధునాతన ఫీచర్ ఉంది. ఇందులో థ్రోటల్‌ను రిలీజ్ చేస్తే బ్రేక్‌తో పని లేకుండా ఆటోమేటిక్‌గా బండి వేగం తగ్గుతుంది.
ఛార్జింగ్
Ather 450 Apex స్కూటీ ఛార్జింగ్ విషయానికొస్తే.. హోమ్ ఛార్జర్‌తో 0-100 శాతం ఛార్జింగ్ అవ్వడానికి 5.45 గం.ల సమయం పడుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
కలర్ ఆప్షన్
ఏథర్ 450 అపెక్స్ ఇండియమ్ బ్లూ పెయింట్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అద్భుతమైన పారదర్శక సైడ్ ప్యానెల్‌లను కలిగి ఉంటుంది.
ధర ఎంతంటే?
Ather 450 Apex స్కూటర్ ధరను కంపెనీ రూ. 1.89లక్షలుగా నిర్ణయించింది. రూ.2,500 చెల్లించి తక్షణమే బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈవీకి సంబంధించిన డెలివరీలు మార్చి నుంచి ప్రారంభం అవుతాయని ఏథర్ ఎనర్జీ వెల్లడించింది.