తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నాని
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్ రోల్స్‌లో చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు‘ చిత్రంతో తొలిసారి ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి‘తో విజయ్ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. ‘గీతా గోవిందం‘ ఫిల్మ్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్’, ‘ఆరెంజ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన ‘LBW‘ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. ‘గుంటూరు టాకీస్‘ చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. 2022లో వచ్చిన ‘డీజే టిల్లు‘ ఈ యంగ్ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సిద్ధూను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో ‘టిల్లు క్యూబ్’ తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.
నవీన్ పొలిశెట్టి
యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్‘ చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత ‘డీ ఫర్ దోపిడి‘, ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్ ‘సాయి శ్రీనివాస ఆత్రేయ‘ చిత్రం.. నవీన్ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్ చెప్పే ఫన్నీ డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక ‘జాతి రత్నాలు‘ ఫిల్మ్‌తో నవీన్ పొలిశెట్టి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్ హీరో నటించగా ఆ ఫిల్మ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.
తేజ సజ్జ
యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన ‘జాంబిరెడ్డి‘ సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్, అద్భుతం సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.
అడవి శేషు
స్టార్ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. తొలి చిత్రం ‘కర్మ‘తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన ‘గూడఛారి‘ చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్: సెకండ్ కేసు’ కూడా సూపర్ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.
ప్రియదర్శి
యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘టెర్రర్‘ చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ‘నావు చావు నేను చస్తా.. నీకెందుకు’ డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. ‘జాతి రత్నాలు‘ మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన ‘బలగం‘ సినిమా ప్రియదర్శిని స్టార్ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!