టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మహేష్ బాబు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓ హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సింహానికి మహేష్ డబ్బింగ్
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) ఒకటి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులతో ముఫాసా అనే సింహం పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్‌కు స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలిపింది. దీని తెలుగు ట్రైలర్ ఈనెల 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
డబ్బింగ్‌పై మహేష్ ఏమన్నారంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ యానిమేషన్ చిత్రంలో మెయిన్ లీడ్‌కు డబ్బింగ్ చెప్పడంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న తెలుగులో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ను బిగ్ స్క్రీన్‌పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. కాగా ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
హిందీలో డబ్బింగ్ ఎవరంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abraham) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేయడంపై షారుక్ ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు. ‘ముఫాసా’ తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
మహేష్‌కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా‘, తారక్ హీరోగా చేసిన ‘బాద్‌షా‘ చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!