బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey) మృతి చెందినట్లు శుక్రవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. అయితే, నటి మరణ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పూనం పాండేనే ప్రకటించారు. తాను బతికే ఉన్నట్లు ఓ వీడియో సందేశాన్ని సైతం విడుదల చేశారు.
అందుకే ఇలా చేశా: పూనం పాండే
తను చనిపోయినట్లు స్వయంగా ప్రకటించుకున్న పూనం పాండే.. అందుకు గల కారణాలను తాజా వీడియోలో వివరించారు. తాను బాధపడుతున్న సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి ఏటా వేలాది మంది మహిళలు చనిపోతున్నట్లు పూనం తెలిపారు. ఆ వ్యాధి బారిన పడితే ఏమి చేయాలన్న అవగాహన చాలా మంది మహిళలకు ఉండటం లేదన్నారు. ఇతర క్యాన్సర్ల లాగే సర్వైకల్ క్యాన్సర్‌ను కూడా జయించవచ్చని తెలిపారు. కొన్ని రకాల టెస్టుల ద్వారా ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తించి హెచ్‌పీవీ వ్యాక్సిన్ (HPV Vaccine) తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుంచి బయటపడ్డవచ్చని ఆమె సందేశం ఇచ్చారు.
ఏకిపారేస్తున్న నెటిజన్లు
మరోవైపు పూనం పాండే చేసిన పనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సర్వైకర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్న ఆమె ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఏమాత్రం ఆమోదయోగ్యమైంది కాదని అంటున్నారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా ఆ వ్యాధిపై అవగాహన కల్పించే మార్గముందని చెబుతున్నారు. మరణం అనేది ఎప్పటికీ జోక్ కాదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
పూనం పాండే తీసుకున్న నిర్ణయం అగౌరవంగా ఉందని.. ఇలాంటివి యాక్టింగ్ స్కూల్‌లో చేసుకుంటే బాగుంటుందని మరో నెటిజన్ అన్నారు. హెల్త్‌కేర్‌కు సంబంధించిన అంశాలను ప్రజలకు చేరువ చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని చెప్పారు.
అటు పూనం పాండే ఫేక్ మరణవార్త గురించి కొన్ని ఫన్నీ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక డెడ్‌బాడీని లిఫ్ట్‌లోకి తీసుకురాగా అది పూనం పాండే లాగా నేను బతికే ఉన్నానని తిరిగి లేచినట్లు ఆ వీడియోలో ఉంది.
మరికొందరు నెటిజన్లు ఇంకా విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుత డీప్‌ఫేక్ వీడియోలు విస్తృతంగా పెరిగిపోవడంతో ఆమె రిలీజ్ చేసిన వీడియో కూడా అలాంటిదేనని ఓ నెటిజన్లు కామెంట్ పెట్టాడు. ఆమె నిజంగానే చనిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ఇది ఆమె పబ్లిసిటీ స్టంట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇది పూర్తిగా హేయమైన చర్య అంటూ మరో వ్యక్తి అభిప్రాయ పడ్డాడు.
ఆమె క్యాన్యర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇలా చేయదని తన గురించి ప్రచారం కోసమే హేయమైన చర్యకు పూనుకున్నారని ఓ నెటిజన్ అన్నారు. ఆమె మరణవార్త విని తాను చాలా ఫీల్ అయ్యాయని.. ఎందుకంటే తన తండ్రి కూడా అలాగే చనిపోయాడని అతడు చెప్పుకొచ్చాడు.
‘అందరూ నన్ను క్షమించండి’
పూనం ఫేక్ మరణవార్తపై విమర్శలు వస్తోన్న వేళ ఆమె మరో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తను చేసిన పని వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారు క్షమించాలని అందులో కోరారు. ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురి చేయాలన్నది తన ఉద్దేశం కాదని.. సర్వైకల్ క్యాన్సర్‌పై విస్తృత ప్రచారం కోసమే తాను ఇలా చేశానని పునరుద్ఘటించారు. ఈ ఫేక్ మరణవార్తను కాసేపు పక్కన పెడితే.. ప్రతీ ఒక్కరూ సర్వైకర్ క్యాన్సర్ గురించే చర్చించుకున్నారని గుర్తు చేసారు. ఆ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలగడం అత్యవసరమని చెప్పారు. తన మరణవార్త ద్వారా ఏం జరగాలని ఆశించానో అది నేరవేరిందని అన్నారు. ఇలా చెప్తునందుకు తాను గర్వపడుతున్నట్లు వీడియోను ముగించారు.