• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?

  న‌టీన‌టులు:  బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు

  ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: యాట స‌త్య‌నారాయ‌ణ‌

  సంగీతం: భీమ్స్ సిసిరోలియో

  ఛాయాగ్ర‌హ‌ణం: కె.ర‌మేష్ రెడ్డి

  ఎడిటింగ్‌ : తమ్మిరాజు

  నిర్మాత‌: గూడూరు నారాయ‌ణ రెడ్డి

  విడుద‌ల తేదీ: 15-03-2024

  తెలంగాణ విముక్తి పోరాటం నేప‌థ్యంలో సాగే చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిన చిత్రం ‘ర‌జాకార్‌’ (Razakar). బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కారణమైన ఈ చిత్రం.. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల‌ గాథ‌ను ఎలా చూపించారు? వివాదాస్ప‌ద‌మైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు చూద్దాం. 

  కథ

  దేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్‌ (నైజాం)ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (మకరంద్‌ పాండే) ఇష్టపడడు. నైజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్‌గా మార్చి ఓ ప్రత్యేక దేశంగా పాలించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఖాసీం రజ్వీ(రాజ్‌ అర్జున్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకుంటాడు. బలవంతపు మత మార్పిడి కోసం ఖాసీం రజ్వీ ప్రజలను అతి దారుణంగా హింసిస్తాడు. ఈ క్రమంలో ఐలమ్మ (ఇంద్రజ), గూడూరు సూర్య నారాయణ, రాజి రెడ్డి (బాబీ సింహా) రజాకార్లకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశారు? ఈ సమస్యను కేంద్ర హోమంత్రి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ (తేజ్‌ సప్రు) ఎలా పరిష్కరించారు? రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

  ఎవరెలా చేశారంటే

  ఈ సినిమాలో కనిపించినా ప్రతీ పాత్ర కీలకమే. ఫ‌లానా పాత్రే ప్రధానమైనదని చెప్ప‌డానికి వీల్లేదు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది. చాక‌లి ఐల‌మ్మ‌గా ఇంద్ర‌జ‌, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంత‌వ్వ‌గా వేదిక‌, నిజాం రాజుగా మ‌క‌రంద్ దేశ్ పాండే, స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్‌గా రాజ్ స‌ప్రు, ఖాసీం రిజ్వీగా రాజ్ అర్జున్‌, లాయ‌క్‌గా జాన్ విజ‌య్… ఇలా ప్ర‌తిఒక్క‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా ఖాసీం రిజ్వీ పాత్ర‌లో రాజ్ అర్జున్ క‌న‌బ‌ర్చిన న‌ట‌న‌.. ప‌లికించిన హావ‌భావాలు.. సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. జాన్‌ విజయ్‌, తలైవసల్‌ విజయ్‌, అరవ్‌ చౌదరి, మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

  డైరెక్షన్ ఎలా ఉందంటే

  ద‌ర్శ‌కుడు యాట స‌త్య‌నారాయ‌ణ.. తాను రాసుకున్న క‌థ‌ను య‌థాత‌థంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్‌ చాలా బాగా చూపించారు. కాక‌పోతే క‌థాంశం సాగిన తీరు ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చు. ప్రథమార్ధంలో ఎక్కువ‌గా ర‌జాక‌ర్ల అకృత్యాలను చూపిస్తే.. ద్వితీయార్ధంలో వారికి ఎదురుతిరిగిన ప్ర‌జ‌ల పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త పాత్రని తెరపైకి తీసుకురావడం.. వారికి ఇచ్చిన ఎలివేషన్‌.. యాక్షన్‌ సీన్స్‌ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. వెయ్యి ఉరిల మర్రి చరిత్ర, పరకాల హింసకాండ, బైరాన్‌పల్లి మారణహోమం లాంటి సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారు. సర్ధార్‌ పటేల్‌.. ఖాసీం రిజ్వీకి ఇచ్చే వార్నింగ్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక ప‌తాక స‌న్నివేశాలు భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టే పోలీస్ చ‌ర్య‌తో సాగుతాయి. అయితే ఈ ఎపిసోడ్‌ను డైరెక్టర్‌ మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. 

  సాంకేతికంగా

  సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ సిసిరోలియో సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో అతడు అదరగొట్టేశాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. కథలో భాగంగానే సాంగ్స్‌ వస్తుంటాయి. బతుకమ్మ పాటతో పాటు చివర్లో వచ్చే జోహార్లు సాంగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్‌కు వంకపెట్టనక్కర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

  ప్లస్‌ పాయింట్స్‌

  • ప్రధాన పాత్రల నటన
  • ప్రజా పోరాట ఘట్టాలు
  • సంగీతం

  మైనస్‌ పాయింట్స్‌

  • మితిమీరిన హింస
  • తెలిసిన కథ కావడం..

  Telugu.yousay.tv Rating : 3/5

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv