• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!

    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    మంజుమ్మల్‌ బాయ్స్‌

    గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.

    2018

    2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది. 

    పులిమురుగన్‌

    మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు. 

    ప్రేమలు (Premalu)

    నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.  

    లూసిఫర్‌ 

    2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం. 

    నెరు 

    గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

    భీష్మ పర్వం

    మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు. 

    ఆర్‌డీఎక్స్‌

    రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు. 

    కన్నూర్‌ స్క్వాడ్‌

    మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

    కురుప్‌

    దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv