సూపర్ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్ ‘కామిక్ కాన్’ (Comic Con). అవెంజెర్స్, స్పైడర్‌మ్యాన్, అవతార్, సూపర్ మ్యాన్ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్ కాన్ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హనుమాన్ (Hanuman)
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్ సూపర్ మ్యాన్ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్ హెయిర్ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు.
భీమ్ (ఆర్ఆర్‌ఆర్)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్’ చిత్రంలో తారక్ (Jr NTR) భీమ్ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్ వారిపై పోరాడే సీన్ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్ వేస్తే మీరూ భీమ్ లాగా కనిపించవచ్చు.
బాహుబలి (Bahubali)
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో అంతం చేస్తాడు. అటువంటి బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.
భల్లాల దేవ (Bhallala Deva)
‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.
కట్టప్ప (Kattappa)
‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.
కాలకేయ (Kalakeya)
కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్ రోల్ హైలెట్ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు.
అపరిచితుడు (Aparichithudu)
ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో విక్రమ్ చేసే ఫైట్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్ డ్రెస్ ధరించి లాంగ్ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.
రోబో (Robo)
భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో రజనీకాంత్ సూపర్ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.
పక్షిరాజా (Pakshi Raja)
‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.
అరుంధతి (Arundhati)
తెలుగులో పవర్‌ఫుల్ ఫీమేల్ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.
పశుపతి (Pasupathi)
తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.
ఆదిత్య 369 (Aditya 369)
బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్ మిషన్ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్ జాకెట్‌ను వేయండి.
సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy)
చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్ చిరంజీవిలాగా లాంగ్ హెయిర్, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.
బింబిసార (Bimbisara)
5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్ హెయిర్ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్ రామ్ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.
అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju)
బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్