• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌!

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్‌ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్‌ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్‌ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు. 

    రిలీజ్‌ ఆ రోజేనా?

    పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్‌’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్‌ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్‌’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్‌ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ‘గేమ్‌ ఛేంజర్‌’ను డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్‌ ఛేంజర్‌’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్‌ వర్క్‌ జరుగుతున్నట్లు సమాచారం. 

    ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌!

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్‌ కానుకగానే విడుదలై బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్‌ 22న వచ్చిన సలార్‌ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్‌ క్రిస్మస్‌కే రిలీజ్‌ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్‌ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్‌ (సైంధవ్‌), తేజ సజ్జా (హనుమాన్‌) వంటి స్టార్‌ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్‌ యూనిట్‌ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్‌ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్‌- అనిల్‌ రావిపూడి చిత్రంతో పాటు అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్‌ ఉంది. కాబట్టి క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేస్తే ప్రభాస్‌ తరహాలోనే బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్‌ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

    గేమ్‌ ఛేంజర్‌పై భారీ ఆశలు!

    డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్‌ తిరిగి సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్‌ ఛేంజర్‌’ పూడుస్తుందని దిల్‌ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్‌ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి. 

    కథ ఇదేనా?

    ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్‌ ఛేంజర్‌’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్‌ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్‌ పేర్కొంది. కాగా ఇందులో చరణ్‌ తండ్రి కొడులుగా డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv