దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో రానున్న చిత్రం కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహేష్ ఫ్యాన్స్, సగటు సినీ అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ ప్రాజెక్ట్ కోసం నిరీక్షిస్తున్నారు. అయితే తరుచూ వివాదాలతో సావాసం చేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘SSMB29’పై క్రేజీ కామెంట్స్ చేశారు. ఎప్పుడు లేనిది రిలీజ్ ముందే ఈ సినిమాను ఆకాశానికి ఎత్తారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారో ఈ కథనంలో చూద్దాం.
‘బాప్ ఆఫ్ ఆల్’
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్నేళ్లుగా సంచలనాలకు మారు పేరుగా మారిపోయారు. అతడు ఏం మాట్లాడిన, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా ప్రతీది సెన్సేషన్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆర్జీవీ, మహేష్ – రాజమౌళి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ‘SSMB29’ కచ్చితంగా ‘బాప్ ఆఫ్ ఆల్’ అవుతుందని వ్యాఖ్యానించారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత మహేష్ చిత్రం కోసం రాజమౌళి చాలా వర్క్ చేశారని గుర్తుచేశారు. డెఫినెట్‌గా ఊహలకు అందని రేంజ్లో ఈ చిత్రం ఉంటుందని సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మహేష్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో వర్మ కామెంట్స్ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి.
రాజమౌళి కంటే నాదే లగ్జరీ లైఫ్: ఆర్జీవీ
దర్శకధీరుడు రాజమౌళి పైనా రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. బాహుబలి కలెక్షన్స్‌ని బాలీవుడ్ సినిమాలు కూడా కలెక్ట్ చేయలేవని వ్యాఖ్యానించారు. ‘రాజమౌళి సక్సెస్ తెలుగు సినిమాది కాదు. ఇది కేవలం రాజమౌళిదే. రాజమౌళి ఎక్కడ పుట్టినా ఇలాగే సినిమాలు తీసేవాడేమో. RRRలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా యూనిక్ గా ఉంటాయి. RRR వల్లే ఇండియన్ సినిమా గురించి చాలా దేశాలకి తెలిసింది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రాజమౌళి గొప్పగా చెప్పుకోడు. రాజమౌళి కంటే నాదే లగ్జరీ లైఫ్’ అటు ఆర్జీవీ కామెంట్స్ చేశారు.
హార్దిక్ పాండ్యా డివోర్స్‌పై..
ఇటీవల హార్ధిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తనదైన శైలిలో స్పందించారు. ‘పెళ్ళీలు నరకంలో నిర్ణయించబడితే, విడాకులు స్వర్గంలో నిర్ణయించబడతాయి. వివాహం చేసుకోవడం కంటే జీతం తీసుకునే ఓ నర్స్‌ను నియమించుకోవడం బెటర్. ప్రస్తుతం రోజు రోజుకు విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి చూసి పేద ప్రజలు డబ్బు ఖర్చు చేయడం మూర్ఖత్వమే. ప్రేమ గుడ్డివారిని చేస్తే పెళ్లి కళ్లు తెరిపిస్తుంది’ అంటూ ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి!
‘SSMB29’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నట్లు సమాచారం. మిగిలిన కాస్త వర్క్‌ను కూడా ఫినిష్ చేసుకొని సెప్టెంబర్‌లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో మహేష్ ద్విపాత్రిభినయం చేస్తున్నట్లు ఇటీవల నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉంటుందని గాసిప్స్ వినిపించాయి. మహేష్ ఇప్పటివరకూ 28 చిత్రాల్లో నటించగా ఎందులోనూ డబల్ రోల్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయలేదు. దీంతో ఈ అప్డేట్ మహేష్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకర్షించింది. మరి ఇందులో వాస్తవం ఎంతో రాజమౌళి టీమ్ తెలియజేయాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి