తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సూర్య తన మెస్మరైజింగ్ నటనతో సౌత్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తండ్రి శివకుమార్ తమిళంలో ప్రముఖ నటుడు కావడంతో సూర్య సినీ రంగ ప్రవేశం అంతా సాఫీగా జరిగి ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. కానీ నిజం కాదు. సూర్య కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విమర్శల రూపంలో ఒడిదొడుకులు ఎదురైన తట్టుకొని ముందుకు సాగారు. ఇవాళ సూర్య 49వ పుట్టిన రోజు (23 జులై) సందర్భంగా అతడి సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సూర్య అసలు పేరు ఇదే!
సూర్యకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శరవణన్. ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఆ పేరును సూర్యగా మార్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్ పాత్ర పేరు కూడా సూర్య కావడం విశేషం. అటు సూర్య తొలి సినిమా ‘నేరుక్కు నేర్’లోని ముహూర్తపు సన్నివేశానికి మణిరత్నమే దర్శకత్వం వహించారు. మణిరత్నం నిర్మాతగా వసంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హీరో విజయ్ (Vijay)తో కలిసి సూర్య నటించాడు.
ఆ ఘటనతో సినిమాలపై అనాసక్తి!
సూర్య తండ్రి శివ కుమార్ అప్పట్లో తమిళంలో పెద్ద హీరో. తండ్రి ప్రోద్భలంతో రంగస్థల నాటక సంఘంలో చేరిన సూర్య ఓ సందర్భంలో తనని తాను పరిచయం చేసుకునేందుకు వేదిక పైకి వెళ్లారు. నలుగురిలో మాట్లాడేందుకు భయమేసి ‘హలో! ఐయామ్ శరవణన్, డూయింగ్ మై డూకామ్’ అన్నారట. దీంతో ఒక్కసారిగా అతిథులందరూ నవ్వారట. షూటింగ్ వాతావరణం కూడా ఇలాగే ఉంటుందేమో అని భావించి సినిమాల్లోకి వెళ్లకూడదని సూర్య నిర్ణయించుకున్నారట.
రూ.600 జీతంతో ఉద్యోగం
హీరోగా నటించిన తండ్రి శివకుమార్, సూర్య డిగ్రీ పూర్తయ్యే సరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. దీంతో కుటుంబ ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సూర్య ఓ గార్మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.600 చొప్పున రెండు నెలలకు రూ.1200 అందుకున్నాడు. కొన్నాళ్లకు వ్యాపారం పెట్టినా కలిసిరాలేదు. అప్పులపాలు కావడంతో సూర్య సినిమాల్లోకి రాకతప్పలేదు.
కెమెరా ఫియర్
కెరీర్ తొలినాళ్లలో కెమెరా అంటే సూర్య తెగ భయపడిపోయేవారట. డైలాగ్స్ చెప్పడం, ఎమోషన్స్ చూపించడానికి తెగ ఇబ్బంది పడేవారట. దీంతో ‘వేస్ట్ ఫెలో’ అన్న విమర్శలను సూర్య ఎదుర్కొన్నారు. తండ్రి ఎంత మంచి నటుడో కుమారుడు అంత వరస్ట్ అని చిత్ర యూనిట్ నుంచి ఛిత్కారాలను భరించారట.
రఘువరన్ వ్యాఖ్యలతో మార్పు
సూర్య పూర్తి స్థాయి నటుడిగా మారడానికి ప్రధాన కారణం నటుడు రఘువరన్. ఓసారి వీరిద్దరూ రైలు ప్రయాణం చేశారు. గాఢ నిద్రలో ఉన్న సూర్యని లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు. ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బతుకుతావ్?’ అని రఘువరన్ అన్నారట. ఆ మాటలకు బాధపడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టారు. ప్రపంచంలోని గొప్ప సినిమాలన్నీ చూసి ఏ హావభావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నారు.
తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు
షార్ట్ డాక్యుమెంటరీ ‘హీరోవా? జీరోవా?’, ‘స్పిరిట్ ఆఫ్ చెన్నై’వంటి మ్యూజిక్ వీడియోల్లోనూ సూర్య నటించారు. ఆస్కార్ అవార్డ్స్ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్యనే కావడం విశేషం.
సూర్య డబ్బింగ్ చెప్పారని తెలుసా!
ఇతర హీరోలకు సంబంధించి సూర్య తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ‘గురు’ (Guru) తమిళ్ వెర్షన్‌లో హీరో అభిషేక్ బచ్చన్‌కు గాత్ర దానం చేశారు. రానా హీరోగా రూపొందిన ‘ఘాజీ’కి తమిళ్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. వ్యాఖ్యాత, గాయకుడు, నిర్మాత ఇలా ప్రతి విభాగంలో సూర్య తనదైన మార్క్ చూపించారు.
అవార్డులే అవార్డులు
27 ఏళ్ల నట ప్రస్థానంలో సూర్య జాతీయ అవార్డు (సూరారై పోట్రు) సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్ ఛాయిస్) విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకూ 6 ఫిల్మ్‌ఫేర్స్, 5 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 2 సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డ్స్, 2, ఎడిసన్ అవార్డ్స్, 2 సైమా అవార్డ్స్, 6 విజయ్ అవార్డ్స్ అందుకున్నారు.
సేవా కార్యక్రమాలు
మంచి మనసు కలిగిన సూర్య ‘అగరం ఫౌండేషన్’ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ వారిలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో విద్యార్థులకి సూర్య సాయమందించారు. ‘జై భీమ్’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో కలిసి ‘అగరం ఫౌండేషన్’ను ప్రారంభించడం గమనార్హం.
‘కంగువా’గా రాబోతున్న సూర్య
సూర్య తాజా చిత్రం ‘కంగువా’ (Kanguva) అక్టోబరు 10న విడుదల కానుంది. అటు తన 44వ సినిమాని సూర్య ఇటీవల ప్రారంభించారు. ‘Suriya 44’ వర్కింగ్ టైటిల్‌తో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!