భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజు ఆగస్ట్ 15. ఇండిపెండెన్స్ డే రోజున అధికారికంగా ఎర్రకోట వద్ద వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. ఇప్పటి వరకు సాధించిన పురోగతి, భవిష్యత్ లక్ష్యాల గురించి ప్రజలతో పంచుకుంటారు. అందుకే ఈ స్పీచ్ కోసం ఆతురతగా ఎదురు చూస్తారు. 2024 ఎన్నికల నేపథ్యంలో మోదీ టర్మ్‌లో జరుగుతున్న చివరి స్వాతంత్య్ర వేడుకలు ఇవే. దీంతో కచ్చితంగా కీలక ప్రకటనలు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. మరి, ఇండిపెండెన్స్ డే రోజున ఇప్పటి వరకు ప్రధాని చేసిన ఆవిష్కరణలు ఏంటో చూద్దామా.
మేక్ ఇన్ ఇండియా
ప్రధానిగా మోదీ తొలిసారి చేసిన ప్రసంగం ఇది. ముఖ్యంగా ఈ వేదిక నుంచి ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వచ్ఛ భారత్ అభియాన్’లకు పిలుపునిచ్చారు. దీంతో పాటు తనను తాను ‘ప్రధాన సేవకుడి’గా ప్రకటించుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లేకుండా ప్రధాని ప్రసంగం చేయడం విశేషం.
ఆయుష్మాన్ భారత్
ఈ ఏడాది జరిగిన స్వాతంత్య్ర వేడుల్లో ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఆయుష్మాన్ భారత్’ పథకం గురించి ప్రకటన చేశారు. దేశంలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో దీనిని తీసుకొస్తున్నట్లు ఆనాడు వెల్లడించారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి రోజున(సెప్టెంబర్ 25) ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ని లాంచ్ చేస్తామని ప్రకటించారు. 50 కోట్ల మంది భారతీయులకు ఇది మేలు చేకూరుస్తుందని తెలిపారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)
2019 ఆగస్ట్ 15న ప్రధాని మోదీ సీడీఎస్ ప్రకటన చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాల మధ్య సమన్వయం కుదర్చడానికి ఒక అధికారి ఉండాలన్న ఉద్దేశంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ని తీసుకొస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ప్రధాన మంత్రికి, త్రివిధ దళాలకు మధ్య సమన్వయ కర్తగా సీడీఎస్ ఉంటారని తెలిపారు. ప్రధాని చేసిన మేజర్ ఆవిష్కరణలలో ఇదొకటిగా నిలిచింది.
అమృత్ మహోత్సవ్
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని అమృత మహోత్సవాలకు పిలుపునిచ్చారు. 75 వారోత్సవాలను జరపాలని ప్రజలను కోరారు. అదే విధంగా దేశంలోని ప్రతి మూలను అనుసంధానించేలా 75 వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీంతో పాటు, లక్షల ఉద్యోగాలను సృష్టించే ‘గతి శక్తి’ ప్రణాళికను అనౌన్స్ చేశారు. ఫోర్టిఫైడ్ రైస్ ప్లాన్, సైనిక్ స్కూల్ గర్ల్స్, నేషనల్ హైడ్రోజన్ మిషన్‌లను ప్రకటించారు.
న్యూ ఇండియా
2017 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ‘న్యూ ఇండియా’ను సృష్టించేందుకు అంకితభావంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం 75 ఏళ్లు, చంపారన్ సత్యాగ్రహ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1942 నుంచి 1947 మధ్య స్వాతంత్య్రోద్యమం జోరుగా సాగిందని, 2017 నుంచి 2022 వరకు భారత పురోగతికి తోడ్పడాలని కోరారు.
పంచ ప్రాణ్
2022 పంద్రాగస్టు వేడకులకు మోదీ ‘పంచ ప్రాణ్’ నినాదమిచ్చారు. ఆనాడు సమర యోధులు చేసిన 5 ప్రతిజ్ఞలను 2047 నాటికి నెరవేర్చాలని పిలుపునిచ్చారు. వీటిని ‘పంచ ప్రాణ్’గా అభివర్ణించారు. సీఎంలు, పీఎం సహా ప్రతి ఒక్క పౌరుడు దేశాభివృద్ధికి తోడ్పడటం; దేశ వారసత్వాన్ని గౌరవించడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఇతర ప్రసంగాలు..
2015లో ప్రధాని ‘స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా’కి పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం నెరవేర్చిన హామీల గురించి వివరించారు. 2016లో కశ్మీర్, పాకిస్థాన్ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో ‘మేక్ ఫర్ వరల్డ్’, ‘వోకల్ ఫర్ లోకల్’ అని నినదించారు. 2020లో ప్రపంచం మొత్తం కోవిడ్‌తో సతమతమైన నేపథ్యంలో మోదీ ఈ పిలుపునిచ్చారు.