దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో ‘SSMB29’ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం వరకూ తరచూ ఏదోక అప్డేట్తో వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. ఇటీవల కాలంలో ఎలాంటి సమాచారం లేకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే తాజాగా కొత్త అప్డేట్తో ఈ సినిమా మరోమారు వార్తల్లో నిలిచింది. రాబోయే మహేష్ చిత్రం.. రెండు ఆఫ్రికన్ నవలల ఆధారంగా రూపొందనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటికి సంబంధించిన వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
కథ.. ఆ నవలల ఆధారమేనా?
టాలీవుడ్లో ఆసక్తిరేపుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో మహేష్ – రాజమౌళి చిత్రం ఒకటి. రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు. ఇప్పటికే సినిమా స్టోరీ కూడా కంప్లీట్ అయ్యిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాంటే తాజాగా రాజమౌళి & టీమ్.. రెండు ఆఫ్రికా నవలల హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విల్బర్ స్మిత్ రాసిన రెండు నవలలను వారు కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ‘SSMB29’ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ ఉంది. నేపథ్యంలో ఆఫ్రికా దేశానికి సంబంధించిన నవలల హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు రావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. వీటి ఆధారంగానే రాజమౌళి SSMB29 తెరకెక్కించనున్నారా? అన్న సందేహాం అభిమానుల్లో మెుదలైంది. ఇందులో నిజానిజాలు ఎంతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఆలస్యానికి కారణమిదే!
SSMB29 సినిమా షూటింగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని సగటు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి జూన్‌లోనే ఈ సినిమా షూటింగ్ మెుదలుకావాల్సి ఉంది. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో సినిమా పట్టాలెక్కలేదు. లొకేషన్స్ వెతకడానికి ఎక్కువ సమయం పట్టడమే షూటింగ్ ఆలస్యానికి కారణమని అంటున్నారు. అయితే పనులు ముగించుకొని డిసెంబర్లో SSMB29 చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని రాజమౌళి భావిస్తున్నారట. అది కుదరకపోతే కొత్త ఏడాది ప్రారంభంలోనైనా షూటింగ్ మెుదలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కీలక పాత్రలో ఇండోనేషియా భామ!
SSMB29లో ఓ హాలీవుడ్ భామ నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు ప్రచారం జరిగింది. అమెరికన్ – ఇండోనేషియా నటిగా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. చిల్సీ ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్!
‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే ‘SSMB29’ కోసం ఇంత సమయం తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయితే సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్ ఆలోచిస్తోందట. అయితే దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.