• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్‌ సర్కార్‌ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి? 

    తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్‌ (Tollywood)ను రేవంత్‌ సర్కార్‌ టార్గెట్‌ చేసిందా అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం నాగార్జున విషయంలో మెుదలైన ఈ ప్రచారం తాజాగా అల్లు అర్జున్‌ నేపథ్యంలో మరోమారు ఊపందుకుంది. రేపో మాపో మోహన్ బాబు అరెస్టు కూడా తథ్యం అన్న వార్తలు నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నారన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలకు తన పవర్‌ ఏంటో రుచి చూపించాలని రేవంత్‌ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్‌ అరెస్టు సందర్భంగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రేవంత్‌ ప్రభుత్వంలో ఇండస్ట్రీకి వ్యతిరేకంగా జరిగిన ఘటనలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. 

    బన్నీ అరెస్టు నేపథ్యంలో..

    అల్లు అర్జున్‌ (Allu Arrest) అరెస్టు నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సర్కార్‌ ఇండస్ట్రీని టార్గెట్ చేసిందా? అన్న అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతకుముందు రేవంత్‌ నుంచి ఎదురైన ప్రతీకూల సంఘటనలకు బన్నీ అరెస్టును ముడిపెట్టి చూసినప్పుడు ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. బన్నీ అరెస్టుపై నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఫిల్మ్‌ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ‘చట్టం ముందు అందరూ సమానులే’.. ‘సినిమావాళ్లు సరిహద్దుల్లో యుద్ధం ఏమీ చేయడంలేదు కదా’.. ‘నాకు నేనే సూపర్‌ స్టార్‌’ అంటూ చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గత ముఖ్యమంత్రులు ఇండస్ట్రీతో ఎంతో సామరస్యంగా ఉన్నారని, రేవంత్‌ ప్రభుత్వం మాత్రం తమపై కన్నెర్ర చేస్తోదంటూ పలువురు దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. 

    మంచు ఫ్యామిలీ గొడవలోనూ..

    ఇటీవల మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మంచు మనోజ్‌ (Manchu Manoj)తో పాటు మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్‌బాబు (Mohan Babu) ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా విమర్శలు చేసుకున్నారు. ప్రధాన మీడియా ఛానళ్లు ఈ ఫ్యామిలీ గొడవ గురించే చూపించింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైనా మోహన్‌బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి సైతం చేశారు. దీనికి సంబంధించి ఆయనపై హత్య కేసు కూడా నమోదైంది. త్వరలో అరెస్టు కూడా చేస్తారని అంటున్నారు. అయితే మనోజ్‌తో వివాదం నేపథ్యంలో పోలీసులకు ముందే ఫిర్యాదు చేసిన వారు ప్రేక్షక పాత్ర వహించారని ఆడియో సందేశంలో మోహన్‌ బాబు అసహనం వ్యక్తం చేశారు. మనోజ్‌ కూడా పోలీసుల వ్యవహార తీరును తప్పుబట్టాడు. ఆపై రాచకొండ సీపీ మంచు విష్ణుతో పాటు, మంచు మనోజ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా మీడియాలో హైలెట్ అయ్యింది. 

    డ్రగ్స్‌ కేసుల విషయంలో.. 

    కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో రేవంత్‌ సెలబ్రిటీ (Tollywood)లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటులు తప్పకుండా డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన వీడియోలు చేయాలని పిలుపునిచ్చారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ దుష్ఫలితాలపై అవగాహన కల్పించే విధంగా తారాగణంతో ఒకటిన్నర లేదా రెండు నిమిషాల నిడివితో వీడియో సినిమాకు ముందు ప్రదర్శించాలని కోరారు. అలా చేస్తేనే టికెట్ ధరల పెంపునకు, షూటింగ్‌లకు తమ ప్రభుత్వం అనుమతిస్తుందని హుకుం జారీ చేశారు. అయితే రేవంత్‌ ఇచ్చిన పిలుపు మంచిదే అయిన్పపటికీ ఆయన ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడటం చాలా మంది దర్శక నిర్మాతలకు నచ్చలేదని అప్పట్లో టాక్ వినిపించింది. 

    గద్దర్ అవార్డ్స్‌ సందర్భంలో..

    సి. నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలోనూ మరోమారు టాలీవుడ్‌ (Tollywood)పై సీఎం రేవంత్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గద్దర్‌ అవార్డులపై రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మండిపడ్డారు. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయించింది. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని సీఎం రేవంత్‌ కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని జులైలో జరిగిన సి. నారాయణ రెడ్డి జయంతి వేడుకల్లో రేవంత్‌ రెడ్డి తప్పుబట్టారు. గద్దర్‌పై గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్‌ పెద్దల నుంచి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. ఓ బహిరంగ సమావేశంలో రేవంత్‌ మరోమారు టాలీవుడ్‌పై విమర్శలు చేయడం అప్పట్లో వార్తల్లో హైలెట్ అయ్యింది.

    ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత

    చెరువులు, కుంటలను ఆక్రమించి భవనాలను నిర్మించిన అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలినాళ్లలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ భవనాన్ని ప్రభుత్వ అధికారులు ఆగమేఘాల మీద కూల్చివేయడం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారన్న ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసును సైతం పోలీసులు నమోదు చేశారు. దీనిని కక్ష్యసాధింపు చర్యగా విపక్షాలు ఆరోపించాయి. దురుద్దేశ్యంతోనే నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారని మండిపడ్డాయి. 

    సమంతపై కాంగ్రెస్‌ మంత్రి వ్యాఖ్యలు

    తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)ను టార్గెట్‌ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యసమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్‌ టార్గెట్‌ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్‌ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీనికి సంబంధించి సదరు మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv