ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావటానికి వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్తగా ముందుకు వస్తుంది. ఇన్నేళ్లు జట్టును ముందుండి నడిపించిన కేన్ విలియమ్సన్ జట్టును వీడినప్పటికీ మార్క్రమ్ పగ్గాలు చేపట్టడం.. హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లు జట్టులోకి రావటంతో నూతనోత్సాహం వచ్చింది. ఇలాంటి తరుణంలో SRH రెండోసారి కప్పు కొడుతుందా? జట్టు ఎంత బలంగా ఉంది? లోటుపాట్లు ఏమున్నాయి? అనేవి చూద్దాం.
నయా టీమ్
సన్‌రైజర్స్ జట్టు గతంలో కంటే మరింత బలంగా కనిపిస్తోంది. మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్ వంటి మేటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ లాంటి టీమిండియా క్రికెటర్లు జట్టుకు పిల్లర్స్‌లా మారారు. వీరందరూ వాళ్ల స్థాయికి తగిన ఆటతీరు కనబరిస్తే విజయాలు తప్పక వస్తాయి.
రెండోసారి తెస్తారా
2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎస్‌ఆర్‌హెచ్ కప్పు సాధించింది. 2018లో ఫైనల్స్ చేరింది. ఆ తర్వాత కూడా ప్లే ఆఫ్స్ చేరుకునే ప్రదర్శన ఇచ్చింది. కానీ, టైటిల్‌ను మాత్రం కైవసం చేసుకోలేక పోయింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ మెుదలుపెట్టారు.
కొత్త సారథి
కేన్ మామను ఫ్రాంఛైజీ విడిచిపెట్టడంతో సారథ్య బాధ్యతలు మార్క్రమ్‌కు వచ్చాయి. మరోసారి విదేశీ ఆటగాడికే పగ్గాలు అప్పజెప్పారు. అయితే, గతేడాది నుంచి మార్క్రమ్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు లీగ్‌లోనూ అతడి ఆటతీరు ప్రశంసనీయంగానే ఉంది. ఇటీవల సౌతాఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీకి కప్పును అందించాడు. కానీ, నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా సిరీస్ ఉన్న కారణంగా ఐపీఎల్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు మార్క్రమ్ దూరం కావచ్చు. దీనిప్రభావం ఎంతమేరకు ఉంటుందో చూడాలి.
కుర్రాళ్ల జోష్
టైటిల్ కొట్టాలంటే సమష్టి కృషి అవసరం. రాహుల్ త్రిపాఠి, సుందర్, అభిషేక్ శర్మ లాంటి వాళ్లు రాణిస్తే మరింత కలిసొస్తుంది. అంతేకాదు, ఇటీవల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచిన హ్యారీ బ్రూక్ మిడిలార్డర్‌లో కీలకం కానున్నాడు. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్రూక్ ఇలానే రాణిస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.
బౌలింగ్‌పైనే దృష్టి
ఒకప్పుడు SRH బౌలింగ్ చూస్తే భయపడే వారు. స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడుకుని విజయాలు కైవసం చేసుకుంది. కానీ, గత రెండు సీజన్లుగా బౌలింగ్‌లో విఫలమవుతున్నారు. భువనేశ్వర్ ఫామ్ కోల్పోయాడు. నటరాజన్‌కు గాయాల బెడదతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ రాణిస్తున్నా.. అతడికి మరో ఇద్దరు తోడైతే బాగుంటుంది. బౌలర్లందరూ కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సరికొత్త ఉత్సాహంతో ఈసారి బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ఇవ్వాలని చూస్తోంది. రెండోసారి కప్పు కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలు నిజం చేయాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. మరి అది నిజమవుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం