గత శుక్రవారం (మే 31) విడుదలైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గం గం గణేశా’, ‘భజే వాయు వేగం’ చిత్రాలు.. థియేటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే విష్వక్ నటించిన గ్యాంగ్య్ ఆఫ్ గోదావరి తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్ రాబట్టగా.. ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’, కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ చెప్పుకోతగ్గ స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే మౌత్ టాక్‌తో శని, ఆదివారాలు మంచి కలెక్షన్స్‌ను ఆకర్షిస్తాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. మరి ఆ అంచనాలు నిజమయ్యాయా? వీకెండ్‌లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్స్ ఎంత? మిగిలిన రెండు చిత్రాల వసూళ్లు పుంజుకున్నాయా? లేదా? ఈ కథనంలో పరిశీలిద్దాం.
దుమ్మురేపిన విష్వక్
విష్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. శుక్ర, శని, ఆదివారాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.16.2 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాలో లంకల రత్న అనే పాత్రలో విశ్వక్‌సేన్ యాక్టింగ్, హీరోయిజంతో పాటు అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న విష్వక్ సేన్ క్యారెక్టర్‌ను దర్శకుడు రాసుకున్న తీరు బాగుందంటూ అభిమానులు చెబుతున్నారు. అటు హీరోయిన్ నేహా శెట్టి.. ఇందులో అంజలి అనే కీలక పాత్రను పోషించింది.
లాభాల్లోకి వచ్చినట్లేనా?
యంగ్ హీరో విష్వక్ సేన్.. నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. ఆయన గత చిత్రాలు నిర్మాతలకు రూపాయి మిగిల్చిందే గానీ, నష్టాల పాలు చేయలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.10 కోట్లకు మేర ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాతలు ప్రకటించిన గ్రాస్ రూ.16.2 కోట్లుగా ఉంది. ట్యాక్స్‌లు, థియేటర్ల అద్దెలు మినహాయిస్తే 95 శాతానికి పైగా పెట్టుబడి మెుత్తం వచ్చేసినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. నేటి నుంచి ఈ సినిమా లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు చెబుతున్నారు.
నిరాశ పరిచిన ‘గం గం గణేశా’
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘గం గం గణేశా’ చిత్రం… బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పర్‌ఫార్మ్ చేయలేకపోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వీకెండ్‌లో ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదని సమాచారం. ఈ మూవీ తొలి మూడు రోజులు.. వరల్డ్ వైడ్‌గా రూ.1.94 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.68 కోట్లు కలెక్ట్ చేసినట్లు స్పష్టం చేశాయి. కాగా, గం గం గణేశా… బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ.5.50 కోట్లుగా ఉంది. ఈ మార్క్‌ను అందుకోవాలంటే ఈ వర్కింగ్ డేస్‌లో ఆడియన్స్‌ను మరింత అట్రాక్ట్ చేయాల్సి ఉంది.
‘భజే వాయు వేగం’కు బెటర్ రెస్పాన్స్
యంగ్ హీరో కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం‘.. మే 31న విడుదలై సాలిడ్ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజు రూ. కోటి లోపే కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. శని, ఆదివారాల్లో గణనీయంగా పుంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల మేర గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, భజే వాయు వేగం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత గ్రాస్ కాకుండా షేర్‌ను పరిగణలోకి తీసుకుంటే నేటి నుంచి ఈ మూవీ కూడా లాభాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.