• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 35 Chinna Katha Kaadu Review: ఇద్దరు పిల్లల తల్లిగా నివేదా థామస్‌.. ఆలోచింపజేసేలా ‘35 చిన్న కథ కాదు’ సినిమా!

    నటీనటులు: నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌ ఆర్‌, గౌతమి, భాగ్యరాజ్‌, కృష్ణ తేజ, అభయ్‌, అనన్య, తదితరులు

    రచన, దర్శకత్వం: నందకిషోర్‌ ఇమాని

    సంగీతం: వివేక్‌ సాగర్‌

    సినిమాటోగ్రఫీ : నికేత్‌ బొమ్మి

    ఎడిటింగ్‌ : టి.సి. ప్రసన్న

    సమర్పణ: రానా దగ్గుబాటి

    నిర్మాతలు: సృజన్‌, సిద్ధార్థ్‌

    విడుదల తేదీ: 6-09-2024

    నివేదా థామస్‌ (Nivetha Thomas), విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu Review). నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు రానా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నటి నివేదా ఇందులో తొలిసారి తల్లి పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్‌ 6న ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందే ప్రెస్‌కు ప్రత్యేకంగా ప్రీమియర్‌ షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? నివేదా చేసిన కొత్త ప్రయోగం ఫలించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. 

    కథేంటి

    ప్రసాద్‌ (విశ్వదేవ్‌), సరస్వతి (నివేదా థామస్‌) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. భర్త, ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌లే లోకంగా సర్వసతి జీవిస్తుంటుంది. పెద్ద కుమారుడు అరుణ్‌ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంటాడు. అతడికి మ్యాథ్స్‌ అసలు అర్థం కావు. కానీ అతడు అడిగే లాజికల్‌ ప్రశ్నలకు టీచర్ల దగ్గర సమాధానాలు ఉండవు. దాంతో లెక్క‌ల మాస్టారు చాణ‌క్య (ప్రియ‌ద‌ర్శి) ఫండమెంటల్స్‌ను ప్ర‌శ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. క్లాస్‌లో చిట్ట చివరిలో బెంచ్‌లో కూర్చోపెట్టడంతో పాటు ఆరోతరగతిలో ఫెయిల్ కూడా చేస్తాడు. దీంతో తన తమ్ముడి క్లాస్‌లో అరుణ్‌ కూర్చోవాల్సి వస్తుంది. ఈసారి అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? క్లాస్‌లో హీరోలా ఎలా అయ్యాడు? తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావాలని టెన్త్‌ ఫెయిల్‌ అయిన తల్లి సరస్వతి ఏం చేసింది?  అరుణ్ అస‌లు 35 మార్కులు తెచ్చుకున్నాడా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

    ఎవరెలా చేశారంటే

    సరస్వతి పాత్రలో నివేదా థామస్‌ జీవించింది. ఇద్దరు పిల్లల తల్లిగా, భార్యగా, బిడ్డకు చదువు చెప్పే గురువుగా చక్కటి నటన కనబరించింది. కళ్లతోనే హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. లెక్కల టీచర్‌ చాణక్యగా ప్రియదర్శి అదరగొట్టారు. పిల్లలతో కఠువుగా ఉంటూనే వారి బాగు కోసం తాపత్రయ పడే టీచర్‌ పాత్రలో చెరగని ముద్ర వేశాడు. నివేదా, చాణక్య పాత్రలు ఈ సినిమాకు రెండు పిల్లర్స్‌గా నిలబడ్డాయి. భర్తగా విశ్వదేవ్‌ నటన బాగుంది. వరుణ్‌, అరుణ్‌ పాత్రల్లో చేసిన ఇద్దరు చిన్నారులు ఆకట్టుకున్నారు. భాగ్యరాజ్‌, కృష్ణతేజ తదితరులు ఇతర కీలకమైన పాత్రల్లో కనిపించారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    35 చిన్న కథ కాదు సినిమాను దర్శకుడు నందకిషోర్‌ ఇమాని సందేశాత్మకంగా రూపొందించారు. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. అదే సమయంలో విద్యార్థుల పట్ల టీచర్లు ఎలా మెలగాలి, భార్య భర్తలు ఎలా ఉండాలో కూడా ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌ను చాలా ఫన్నీగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నడిపించి దర్శకడు ఆకట్టుకున్నారు. నివేదా థామస్‌, విష్ణుదేవ్‌ మధ్య వచ్చే మిడిల్‌ క్లాస్‌ లైఫ్ అనుభూతులను చక్కగా తెరకెక్కించారు. భార్య, భర్తలుగా వారి మధ్య కెమెస్ట్రీ బాగా పండింది. స్కూల్‌ వాతావరణాన్ని కూడా దర్శకుడు చక్కగా చూపించాడు. స్కూల్లో పిల్లలు పడే ఇబ్బందులను కళ్లకు కట్టారు. ఇక సెకండాఫ్‌లో ఫ్యామిలీలో జరిగే భావోద్వేగ సన్నివేశాలు మనసును హత్తుకునేలా చూపించారు డైరెక్టర్‌. అక్కడక్కడ నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్‌ హంగులు లేకపోవడం, మెరుపులులేని కథ, కొన్ని పాత్రల సంభాషణలో స్పష్టత లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. 

    టెక్నికల్‌గా..

    సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ముఖ్యంగా వివేక్‌ సాగర్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. భావోద్వేగ సన్నివేశాలను బీజీఎం బాగా రక్తి కట్టించింది. ఎడిటర్‌ వర్క్‌ ఓకే. అక్కడక్కడ ఉన్న సాగదీత సన్నివేశాలను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉండే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథా నేపథ్యం
    • నివేదా, ప్రియదర్శి నటన
    • ఎమోషనల్‌ సీన్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • స్లో నారేషన్‌
    • కథలో మెరుపులు లేకపోవడం

    Telugu.yousay.tv Rating : 3/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv