టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 1) బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ (NBK 50 Years Celebrations) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో దర్శకుడు బోయపాటితో పాటు ఇతర కథా రచయితలకు బంపరాఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బాలయ్యతో మల్టీస్టారర్‌కు గ్రీన్ సిగ్నల్
బాలకృష్ణ సినీ స్వర్ణోత్వవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కామెంట్స్ చేశారు. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు. ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య మారుపేరుగా మారారని కొనియాడారు. ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఒకరకంగా బాలకృష్ణనే తనకు ప్రేరణ అని చిరు చెప్పుకొచ్చారు. ఇంద్రసేనా రెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో ఎవరైనా డైరెక్టర్ గానీ, రచయిత గానీ మంచి కథతో వస్తే తాను నటించడానికి సిద్ధమని మెగాస్టార్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ‘నీవూ రెడీనా’ అని అనగానే బాలకృష్ణ సైతం డబుల్ ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనును ప్రత్యేకంగా సూచిస్తూ మీరు కథ రాస్తే నటించడానికి రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. అదే సమయంలో వైవీఎస్ చౌదరి పేరును కూడా చిరు ప్రస్తావించారు.
బోయపాటే ఎందుకు?
బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్‌కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్ బోయపాటి.. ఛాలెంజ్’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్ డైరెక్టర్ వై.వీ.యస్. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.
రంగంలోకి వై.వి.ఎస్..?
ఇంద్ర, సమరసింహారెడ్డి సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించగలిగితే టాలీవుడ్‌లో నెవర్ బిఫోర్ మల్టీస్టారర్ రావడం పక్కా అని చెప్పవచ్చు.
ఫ్యాన్ వార్‌పై చిరు క్రేజీ కామెంట్స్
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ఇటీవల బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని మెగాస్టార్ అన్నారు.