‘పుష్ప’ (Pushpa: The Rise) సినిమా సక్సెస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్పరాజ్‌గా తన నటనతో మెస్మరైజ్ చేసిన బన్నీ, పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)తో మరోమారు తెలుగు ఆడియన్స్‌తో పాటు దేశంలోని సినీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ‘పుష్ప 2’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో బన్నీ తర్వాతి ప్రాజెక్ట్ ఎవరితోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ నెక్ట్స్ సినిమా ఉండొచ్చని ప్రస్తుతం అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ-అట్లీ ప్రాజెక్ట్‌కు సంబంధించి షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.
అట్లీ ప్రాజెక్ట్ పక్కన పెట్టిన బన్నీ!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు కొద్ది నెలల క్రితం నుంచి ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. ‘పుష్ప 2’ షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ మెుదలవుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ లాంటి బ్లాక్ బాస్టర్ తీసిన అట్లీతో బన్నీ సినిమా చేయనుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే లెటేస్ట్ బజ్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మనసు మార్చుకోవడం వల్లే ఈ సినిమా అటకెక్కిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు త్వరలోనే తేలనుంది.
సల్మాన్‌తో అట్లీ సినిమా!
బన్నీతో ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారడంతో డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఓ మూవీ కూడా ఓకే అయిందని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో అట్లీ సినిమా ఫిక్స్ అయ్యిందంటూ బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అట్లీ చెప్పిన స్టోరీ సల్లూ భాయ్‌కి విపరీతంగా నచ్చిందని, అతడు వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంటున్నారు. షారుక్ ఖాన్‌తో వర్క్ చేసిన అనుభవం అట్లీకి ఉండటంతో ప్రాజెక్ట్ ఓకే చేసేందుకు పెద్దగా సమయం కూడా తీసుకోలేదని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సల్మాన్‌తో పాటు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరో నాలుగు నెలల్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసి సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో అట్లీ ఉన్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ!
అట్లీ ప్రాజెక్ట్ సైడ్ అయిపోవడంతో బన్నీ నెక్స్ట్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తోనే చేయనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కాన్సెప్ట్‌ను లాక్ చేసేందుకు బన్నీ-త్రివిక్రమ్ ఏడాదిన్నర సమయం తీసుకున్నట్లు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇటీవల వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నడూ చూడని సరికొత్త జానర్‌లో ఈ మూవీ రూపుదిద్దుకోనున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. ఇప్పటి వరకు సాంఘీక అంశాలపై సినిమాలు తీసిన త్రివిక్రమ్ మొదటిసారి బన్నీ కోసం మైథలాజికల్ జానర్‌ని టచ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ అండ్ టీం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
బాలయ్య ఫంక్షన్‌కు డుమ్మా!
మెగా-పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య 50 వసంతాల సినీ కెరీర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ఒకే వేదికపై కనిపిస్తారని అంతా భావించారు. వారిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్ వార్స్ కూడా కాస్త తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం (సెప్టెంబర్ 1) జరిగిన ఈ వేడుకకు అనూహ్యంగా బన్నీ హాజరు కాలేదు. నిజానికి బాలకృష్ణకు అల్లు అరవింద్, బన్నీ చాలా క్లోజ్. ‘ఆహా’లో వస్తున్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమాన్ని బాలయ్య రక్తికట్టిస్తున్న సంగతి తెలిసిందే. అదే కార్యక్రమంలో బన్నీ-బాలయ్య సాన్నిహిత్యాన్ని కూడా అంతా చూశారు. అయినప్పటికీ బన్నీ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ వస్తున్నారన్న సమాచారం నేపథ్యంలోనే బన్నీ కావాలనే హాజరు కాలేదన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్