అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న సామెతలా మారింది కొత్త సినిమా స్కైలాబ్. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తులసి వంటి వారు నటించిన స్కైలాబ్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నుంచి విడుదలయిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. అలాగే మూవీ టీం చేసిన ప్రమోషన్లతో కూడా సినిమాలో ఏదో ఉందని అందరూ భావించారు. అందుకోసమే ఈ సినిమా కోసం అంతలా ఎదురు చూశారు. తీరా ఈ సినిమా చూశాక ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీ కథ 1979లో జరుగుతుంది. కావున మనకు పాత్రలను కూడా ఆనాటి కాలం వారిలాగానే చూపించారు.
కరీంనగర్‌తో మొదలు..
ఈ మూవీ స్టోరీ కరీంనగర్ జిల్లాలోని బండలింగం పల్లి అనే కుగ్రామంలో ప్రారంభమైనట్లు మనకు చూపిస్తారు. ఆ ఊరిలో పెద్ద జమీందారీ కుటుంబానికి చెందిన అమ్మాయి గౌరి (నిత్యామీనన్) జర్నలిజం చదువుతుంది. అలా జర్నలిజం పూర్తయిన తర్వాత తన విలువేంటో నలుగురికి చాటి చెప్పేందుకు ఇంటి దగ్గర ఓ శపథం చేసి సిటీకి వస్తుంది. అలా సిటీకి వచ్చిన గౌరి ప్రతిబింబం అనే ఓ పత్రికలో చేరుతుంది. కానీ అక్కడ నిత్యామీనన్ ఇమడలేకపోతుంది. గౌరి వలన ఎటువంటి ఉపయోగం లేదని ఆ పత్రిక ఎడిటర్ గౌరిని ఉద్యోగం నుంచి పీకి పారేస్తాడు. అలా గౌరి ఉద్యోగం కోల్పోయి మరలా ఇంటి ముఖం పడుతుంది. కానీ ఎప్పటికైనా తన పేరును పత్రికలో వేయించుకోవాలనే ఆశ మాత్రం గౌరిలో అలాగే ఉంటుంది. బండలింగం పల్లి గ్రామానికే చెందిన ఆనంద్ (సత్యదేవ్) డాక్టర్‌గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కానీ సస్పెండై పోవడంతో ఊరెళ్లి క్లినిక్ పెట్టుకోవాలని భావిస్తాడు. ఇక అదే ఊరికి చెందిన సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ) తన కుటుంబం చేసిన అప్పులు తీర్చడం కోసం నానా తంటాలు పడుతూ ఉంటాడు. తన తాత పేర ఉన్న భూమిని అమ్మితే అప్పులు మొత్తం తీరిపోతాయని ఆశ పడుతుంటాడు. కానీ ఆ భూమి ఏదో వివాదంలో ఉంటుంది.
ఇలా ఒకే ఊరికి చెందిన ఈ ముగ్గురు వ్యక్తులు వేర్వేరు కారణాలతో సతమతమవుతున్న వేళ ఓ పిడుగు లాంటి వార్త దావానంలా వ్యాపిస్తుంది. అమెరికా అంతరిక్ష ప్రయోగ కేంద్రం నాసా ప్రయోగించిన స్కైలాబ్ అనే రాకెట్ భూమి మీద పడి భూమండలం మొత్తం నాశనమవుతుందని ఆ వార్త సారాంశం. ఆ స్కైలాబ్ బండలింగం పల్లి గ్రామం మీదే పడుతుందని కూడా పుకార్లు క్రియేట్ చేస్తారు కొందరు. ఈ పుకార్లను సాధారణ ప్రజానీకం నమ్మి విపరీతంగా భయపడుతుంటారు. ఈ స్కైలాబ్ ఘటన వలన గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో అనుకోని మార్పులు వస్తాయి. వారి మార్పుల గురించి తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా సినిమా చూసి తీరాల్సిందే..
సీనియర్ నటి అయిన నిత్యమీనన్ జర్నలిస్ట్ గౌరి పాత్రలో జీవించేసింది. ఇక సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ కూడా తమ పరిధి మేర బాగానే నటించారు. ఆనంద్ తాతగా తనికెళ్ల భరణి, గౌరి తల్లిగా తులసి మరోసారి తమ అనుభవాన్నంతా రంగరించి నటించారు. ఇక గౌరి ఇంట్లో పని చేసే కుర్రాడి పాత్రలో కొత్త వ్యక్తి విష్ణు కూడా ఆకట్టుకున్నాడు. ఇక మిగతా వారు తమ పరిధి మేర నటించి పరవాలేదనిపించారు.
పీరియాడిక్ కథ అని అనేసరికి అందరికీ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎలా ఉంటుందో అని అభిమానులు ఆశతో ఎదురుచూశారు. కానీ అభిమానుల ఆశలపై డైరెక్టర్ విశ్వక్ ఖండేరావు నీళ్లు చల్లాడు. నెమ్మదైన కథనంతో ప్రేక్షకుడి సహనానినికి పరీక్ష పెట్టాడు. స్కైలాబ్ సమయంలో ఏం జరిగింది, అప్పటి ప్రజలు ఎలా ఫీలయ్యారనేది కొత్త పాయింట్ అయినప్పటికీ కథనం బోర్ కొట్టిందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కామెడీ కూడా ఎక్కువగా సినిమాకు ప్లస్ కాలేదు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన ప్రశాంత్ ఆర్ విహారి పరవాలేదనిపించాడు. అతడు కంపోజ్ చేసిన పాటలు వినసొంపుగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా పరవాలేదనిపించాడు. సినిమాటోగ్రఫీ అందించిన ఆదిత్య జవ్వాది కూడా పల్లె వాతావరణాన్ని స్క్రీన్ మీద చక్కగా ప్రజెంట్ చేశాడు. అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని ఉందన్నట్లుగా సినిమాలో కథ బాగున్నా కానీ కథనం బాగోలేకపోవడంతో ప్రేక్షకుడు కనెక్ట్ కావడం కష్టంగా మారుతుంది.
రేటింగ్: 2.25/5