దేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్- ఐనాక్స్ లిమిటెడ్ (PVR INOX Limited) మూవీ లవర్స్ కోసం బంపరాఫర్ తీసుకొచ్చింది. సినిమా సబ్స్క్రిప్షన్ సర్వీసు రెండవ ఎడిషన్‌ను తాజాగా ప్రారంభించింది. ‘పీవీఆర్ పాస్‌పోర్ట్ 2.0’ పేరుతో ఈ కూపన్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. కొన్ని నెలల క్రితమే పీవీఆర్.. ఈ పాస్‌పోర్ట్ కూపన్ సర్వీస్‌ను ప్రారంభించింది. తొలి ప్రయత్నం సందర్భంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని పరిగణలోకి తీసుకొని పాత సర్వీసులో మార్పులు చేస్తూ కొత్తగా ‘పీవీఆర్ పాస్‌పోర్ట్ 2.0’ (PVR Passport 2.0)ను ప్రవేశపెట్టింది. అసలు ఈ ‘పీవీఆర్ పాస్‌పోర్ట్’ సర్వీస్ అంటే ఏంటి? ‘పీవీఆర్ పాస్‌పోర్ట్ 2.0’ ద్వారా తీసుకొచ్చిన ఆఫర్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
‘పీవీఆర్ పాస్‌పోర్ట్ సర్వీసు’ అంటే ఏంటి?
సాధారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను చూడటానికి ఇష్టపడుతుంటారు. కానీ ప్రతీ వారం థియేటర్లో సినిమా చూడాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఆ ఖర్చుకు వెనకాడి ఓటీటీల్లోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్.. ఓ కూపన్ విధానాన్ని తీసుకొచ్చింది. తక్కువ ధరకే నిర్ణిత టికెట్లను కూపన్ రూపంలో ఇవ్వడం ద్వారా తమ థియేటర్స్‌కు ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో రూ.700 కడితే పది సినిమాలు అంటూ పీవీఆర్ పాస్‌పోర్ట్ సర్వీసును ప్రారంభించింది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తాజాగా కొన్ని మార్పులు చేస్తూ రెండో విడత కూపన్ ఆఫర్లను ప్రకటించింది.
‘పీవీఆర్ పాస్‌పోర్ట్ 2.0’
‘పీవీఆర్ పాస్ పోర్టు 2.0’ ద్వారా సినిమా ప్రేక్షకులు రూ.349 ధరతో 4 సినిమా కూపన్లు పొందవచ్చు. దీనిని నెలలోపే వినియోగించాల్సి ఉంటుంది. అది కూడా వీకెండ్లో కాకుండా సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.200 వరకూ ఉంటుంది. దీని ప్రకారం నాలుగు టికెట్లు కొనాలంటే రూ.800 వరకూ ఖర్చు చేయాలి. ‘పీవీఆర్ పాస్ పోర్టు 2.0’ కూపన్‌ను కొనుగోలు చేస్తే సగం ధరకే నాలుగు టికెట్లను కొనుగోలు చేయవచ్చు. అంటే ప్రతీ టికెట్‌కు కేవలం రూ.87 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ ఆఫర్‌తో ప్రతీవారం సినిమా చూడాలన్న కోరికను నెరవేర్చుకోవచ్చు. అయితే కొత్తగా రిలీజయ్యే పెద్ద సినిమాలకు ఈ కూపన్లు వర్తిస్తాయో లేదో కంపెనీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఈ ఆఫర్ కొద్దిమందికి మాత్రమే!
‘పీవీఆర్ పాస్ పోర్టు 2.0’ ఆఫర్ రెండు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా కొద్దిమందికి మాత్రమే. ఈ విడతలో 50,000 పాస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. కూపన్లను పీవీఆర్, ఐనాక్స్ వెబ్‌సైట్స్‌తో పాటు యాప్స్‌లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే పేటీఎం యాప్ ద్వారా కూడా ఈ పాస్‌లను పొందవచ్చని పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ‘పీవీఆర్ పాస్ పోర్టు 2.0’ అందుబాటులోకి రావడంతో పాస్‌లు చాలా వేగంగా సేల్ అవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాబట్టి తక్కువ ఖర్చుతో నాలుగు సినిమాలు చూడాలని కోరుకునేవారు వెంటనే పాస్‌లు కొనుగోలు చేయండి.