మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే పలు రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా (The Highest Grossing Malayalam Film Ever) నిలిచింది. విడుదలైన తొలి 25 రోజుల్లోనే ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ దీనిలా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కాగా, గతేడాది వచ్చిన ‘2018’ చిత్రం ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉంది. ‘మంజుమ్మెల్ బాయ్స్’ రాకతో ఈ సినిమా రెండో స్థానానికి పడిపోయింది.
మార్చి 29న తెలుగులోకి..!
శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపత్, లాల్ జూనియర్, దీపక్ కీలక పాత్రల్లో చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైన మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu) సైతం ఘన విజయం సాధించింది. ఇటీవల తెలుగులోనూ దాన్ని విడుదల చేయగా ఇక్కడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది.
కలెక్షన్స్‌లో టాప్- 5 ఇవే
‘మంజుమ్మెల్ బాయ్స్’ తర్వాత ‘2018’ సినిమా రెండో స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ.180 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్ నటించిన ‘మన్యం పులి’ (రూ.150 కోట్ల గ్రాస్), ‘లూసిఫర్’ (రూ.130 కోట్ల గ్రాస్) ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ‘ప్రేమలు’ కూడా ఇప్పటి వరకు రూ.117 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఐదో స్థానంలో నిలించింది.
ఈ సినిమా కథేంటి?
2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రాన్ని రూపొందించారు. కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్ బాయ్స్’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.