ప్రస్తుతం దేశంలో ‘కల్కి’ ఫీవర్ నడుస్తోంది. ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).. గురువారం (జూన్ 27) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, ఇందులో ప్రభాస్ మహా విష్ణువు అవతారమైన ‘కల్కి’ పాత్రలో కనిపిస్తారని తొలుత జోరుగా ప్రచారం జరిగింది. కానీ, కల్కి ఫస్ట్ ట్రైలర్ చూశాక.. ప్రభాస్ ‘కల్కి’ కాదని తెలిసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే ట్విస్ట్ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కల్కి పూర్తి స్టోరీ ఇదేనంటూ ఓ కథ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
స్త్రీలపై కలి ప్రయోగాలు!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో మెుత్తం మూడు ప్రపంచాలు ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఇప్పటికే ఓ స్పెషల్ వీడియా ద్వారా తెలియజేశారు. ఇందులో ఒకటి ‘కాశీ’ కాగా, మిగిలినవి ‘శంబాల’, ‘కాంప్లెక్స్’. లేటెస్ట్ బజ్ ప్రకారం.. శంబాలాలో అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) ఉంటారు. కాంప్లెక్స్‌లో విలన్ అయిన కలి (కమల్ హాసన్) ఉంటారు. కాశీ, శంబాలాలో ఉండే ప్రజల జీవితాలు మారాలంటే కల్కి రావాల్సిందే. అయితే కల్కి సాధారణంగా పుట్టే వరకూ ఆగలేక కలి.. తన ల్యాబ్‌లో స్త్రీలపై ప్రయోగాలు చేస్తుంటాడట. కల్కి శక్తులను తన వశం చేసుకొవాలన్నది కల్కి ప్లాన్ అన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ నుంచి ఓ మహిళ (దీపిక పదుకొణె) పారిపోయి శంబాలకు వస్తుంది. కల్కి ఆమెకే పుడతాడని గ్రహించిన అశ్వత్థామ.. ఆమెకు రక్షణ కల్పిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
అశ్వత్థామ vs భైరవ
మరోవైపు కాశీలో ఉండే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే అందుకు యూనిట్స్ అవసరమవుతాయి. ఈ క్రమంలోనే కాంప్లెక్స్ నుంచి తప్పించుకున్న మహిళను పట్టుకుంటే పెద్ద మెుత్తంలో యూనిట్స్ (నగదు) అందిస్తామని కాంప్లెక్స్ ప్రతినిధులు ఆఫర్ ఇస్తారు. దీంతో మహిళను అప్పగించి ఎలాగైన మిలియన్ యూనిట్స్‌తో కాంప్లెక్స్‌లో సెటిల్ అవ్వాలని భైరవ భావిస్తాడు. ఈ క్రమంలోనే ఆ మహిళకు రక్షణగా ఉన్న అశ్వత్థామతో యుద్ధానికి దిగుతాడు. భైరవ యుద్ధం చేసే క్రమంలో అతడి సత్తా ఏంటో అశ్వత్థామకు అర్థమై అతడు ఆశ్చర్యపోతాడని వైరల్ అవుతున్న స్టోరీని బట్టి తెలుస్తోంది.
కల్కిగా ప్రభాస్!
భైరవ, అశ్వత్థామ మధ్య బీకర పోరు జరుగుతున్న సమయంలోనే కల్కిని కడుపులో మోస్తున్న దీపికకు గాయమవుతుందని లేటెస్ట్ బజ్ ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కడుపులోని బిడ్డకు సైతం ప్రమాదం జరుగుతుందని అంటున్నారు. మరోవైపు అశ్వత్థామతో యుద్ధం చేసే క్రమంలోనే కలి చేస్తున్న అన్యాయాల గురించి భైరవకు తెలుస్తుందట. దీంతో అతడిలో మార్పు వస్తుందట. అలా అశ్వత్థామ.. కల్కి శక్తులను భైరవకు ట్రాన్స్‌ఫర్ చేస్తారని అంటున్నారు. ఈ ప్రక్రియతో తొలి భాగం ముగుస్తుందని సమాచారం. ఇక కల్కి సెకండ్ పార్ట్‌లో.. ‘కలి vs కల్కి’గా కథ మారిపోతుందని సమాచారం. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు. ఈ స్టోరీనే నిజమైతే బొమ్మ బ్లాక్‌బాస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
లాజిక్ మిస్..!
కల్కి స్టోరీ ఇదేనంటూ వైరల్ అవుతున్న కథ.. కొంచెం కన్విన్సింగ్‌గానే ఉన్నప్పటికీ ఒకటి మాత్రం లాజిక్‌కు అందడం లేదు. దీపికా పదుకొణె గర్భంలో ఉన్న కల్కి పుట్టకముందే చనిపోతాడన్నది లాజిక్‌లెస్‌గా ఉంది. కల్కి అనేది శ్రీ మహావిష్ణువు 10వ అవతారం. అలాంటి కల్కి పాత్రను కడుపులోనే చనిపోయినట్లు చూపించడం పురాణాలను తప్పుబట్టినట్లు అవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పురాణాలతో డిఫర్ అయ్యేలా కల్కి కథను రాసుకునే ఛాన్స్ లేదని సినీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. మరి కల్కి పాత్రలో కనిపించబోయేది ఎవరు? అన్నదానిపై స్పష్టత రావాలంటే జూన్ 27 వరకూ ఆగాల్సిందే.