మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సక్సెస్‌తో గ్లోబల్ స్థార్‌గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌ను కెరీర్ ప్రారంభం నుంచి ఓ సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య నుంచి చరణ్ ఎన్నిసార్లు బయటపడాలని చూసిన కుదరడం లేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ సైతం అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టే దిశగా రామ్‌చరణ్ సరికొత్త ప్లాన్స్‌ను రచిస్తున్నాడు. ఆ దిశగా ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ సైతం తెగ ఖుషీ అవుతున్నారట. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దానిపై చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
సెట్స్‌పైకి రెండు చిత్రాలు!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చింది 13 చిత్రాలు మాత్రమే. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీని నుంచి ఎన్నిసార్లు బయటపడాలని చూసిన అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సమస్యకు కచ్చితంగా చెక్ పెట్టాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సంవత్సరానికి రెండు చొప్పున చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాకముందే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
ప్రభాస్‌ను అనుసరిస్తున్నాడా?
ప్రభాస్ కూడా తన ప్రాజెక్టుల విషయంలో గతంలో కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానానికి స్వస్థి పలికి ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీతో ‘రాజాసాబ్’ అనే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్ కల్లా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని ‘స్పిరిట్’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.
ముఖ్య అతిథిగా రామ్‌చరణ్
దక్షిణాది సినీ అవార్డుల పండుగ ‘ఐఐఎఫ్ఏ ఉత్సవం’ (IIFA Utsavam 2024) కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబరు 27న ఐఐఎఫ్ఏ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) వేడుక జరగనుంది. ఇక్కడి ఎతిహాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు చరణ్‌తో పాటు పలువురు దక్షిణాది ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ ఏడాది లేనట్లే!
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిర్మాత దిల్ రాజు కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం గేమ్ ఛేంజర్ డిసెంబర్‌లో రావడం కష్టమేనని అంటున్నారు. డిసెంబర్ 20కి ఇప్పటికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.