• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?

    ‘భారతీయుడు’ సహా పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar)  తాజాగా తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే ప్రజల్ని బానిసలతో పోలుస్తూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. చరిత్రలో ఏం జరిగిందో వివరిస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సైతం చర్చనీయాంశంగా మారాయి. అయితే నటి కస్తూరికి చరిత్ర తెలిసి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. తమిళ నేలపై తెలుగు రాజులు, నేతలు, వ్యక్తులు ఎంతటి ఘనత సాధించారో తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది. 

    అసలేం జరిగిందంటే?

    తమిళ నటి కస్తూరి చేసిన తాజా కామెంట్స్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపాయి. భాజాపాలో చేరిన ఆమె చెన్నైలోని గురుమూర్తి నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. డీఎంకే (DMK), కరుణానిధి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. 300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారని అన్నారు. రాణులకు సేవలు చేయడానికి ఇక్కడికి వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ఇతరుల భార్యలపై కన్నేయవద్దని బ్రాహ్మణులు చెబుతున్నందుకే ద్రవిడ (Dravida) వాదులు వాళ్లని వ్యతిరేకిస్తున్నారని, అందుకే సనాతన ధర్మాన్ని (Sanathana Dharmam) డీఎంకే వ్యతిరేకిస్తోందన్నారు. తెలుగు మాట్లాడితే చాలు తమిళనాడు కేబినెట్‌లో మంత్రులు అవుతున్నారని, డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు.

    తమిళ చరిత్రపై ప్రభావం

    తమిళనాడును పరిపాలించిన ప్రముఖ రాజవంశాల్లో చోళులు ఒకరు. వారిలో కుళోత్తంగ చోళుడు తెలుగువాడు. అతడి తండ్రి రాజ రాజ నరేంద్రుడు వేంగి చాళుక్య రాజు. ఈయన ఏపీలోని కృష్ణ- గోదావరి మధ్య ప్రాంతాన్ని పాలించాడు. కుళుత్తోంగ చోళుడి  తల్లి అమ్మాంగైదేవి చోళ రాజ్యపు యువరాణి.  ఆమె తండ్రి మరణం తర్వాత చోళ రాజ్యంలో అస్థిరత నెలకొంటుంది. దీంతో కులుత్తోంగ చోళుడు తన తాతా సామ్రాజ్యాన్ని కాపాడి చక్రవర్తిగా అక్కడే కొనసాగుతాడు. ఆ తర్వాత ఆయన వారసులు కూడా తమిళనాడుని దిగ్విజయంగా ఏలారు. (క్రీ.శ. 1061-1118) మధ్య చాళుక్యుల చక్రవర్తిగా కులోత్తుంగుడు వ్యవహరించారు. అయితే అతడి కుమారుడు విక్రమ చోళుడు.. చోళ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. తెలుగు వారైన చాళుక్యుల రక్తం విక్రమ చోళుడిలో ఉంది. దీన్ని బట్టి గొప్ప తమిళ రాజ్యంగా చెప్పుకుంటున్న చోళ సామ్రాజ్యాన్ని ఓ తెలుగు వ్యక్తి పరిపాలించాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ ప్రకారం చూసుకుంటే తమిళ చరిత్రపైనా మనవారి ముద్ర స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. 

    Image credit: Wikimedia Commons

    తెలుగు రాజు పేరు మీద ‘చెన్నై’

    తమిళనాడు రాజధానిగా ఉన్న చెన్నైకి ఆ పేరు ఓ తెలుగు వ్యక్తి ద్వారా వచ్చింది. ఆంధ్ర పద్మనాయక ప్రభువైన వెంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు క్రీ.శ. 1639లో ఈ పట్టణాన్ని పాలించాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని మద్రాసు పట్టణంగా మార్చారు. కాలక్రమణా ఆ పట్టణం మద్రాసుగా మారింది. కానీ స్థానికులు మాత్రం చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలవడానికే ఇష్టపడేవారు. స్థానికుల కోరిక మేరకు స్వాతంత్రం అనంతరం 1996 ఆగస్టులో మద్రాసు పేరును చెన్నైగా మార్చారు. 

    Image credit: Wikimedia Commons

    మద్రాసుపై తెలుగు వారి ప్రభావం

    ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మద్రాసు (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రం ఒక్కటిగా కలిసి ఉండేది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కారణంగా 1953 అక్టోబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారే అన్ని రంగాల్లో కీలకపాత్రలు పోషించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. 1925-29 మధ్య శ్రీకాళహస్తి జమీందారు పానగంటి రామారాయనం జస్టిస్ పార్టీ అధ్యక్షులుగా, మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి హయాంలోనే ప్రస్తుత త్యాగరాయనగర్ రూపుదిద్దుకుంది. 1932-36 మధ్యకాలంలో బొబ్బిలి రాజు శ్రీ రామకృష్ణ రంగారావు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వ్యవహరించారు. రావు బహదూర్ కూర్మా వెంకట రెడ్డి మద్రాసు గవర్నర్‌గా పనిచేశారు. అంతేకాదు వీడిపోయే ముందువరకూ కూడా తెలుగు వ్యక్తి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సీఎం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన ముగ్గురు వ్యక్తులు తెలుగువారే. ఇలా రాజకీయాలతో పాటు విద్య, వైద్యం, న్యాయశాస్త్రం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు.

    Image credit: Wikimedia Commons

    వందల్లో తెలుగు గ్రంధాలు

    విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో. అటువంటి దేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ‘ఆముక్తమాల్యద’ తాళపత్ర గ్రందం ఇప్పటికీ తమిళనాడులోని తంజావూరు గ్రంథాలయంలో భద్రంగా ఉంది. దానితో పాటు 778 తాళపత్ర గ్రంథాలు అక్కడి లైబ్రరీలో ఉన్నాయి. గణితం, వైజ్ఞానిక శాస్త్రం, గణితం, పురాణాలు ఇలా ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి తెలుగు సంస్కృతి ప్రభావం తమిళనాడుపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి రాజుల సాంస్కృతిక కళా పోషణకు తమిళనాడు ప్రతీకగా నిలవడాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv