‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) ఆ సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు ఆ మూవీ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి కల్ట్ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు అందించి యూత్‌కు మరింత చేరవయ్యాడు. యంగేజ్ కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ఆ తర్వాత నటుడిగానూ సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇటీవల ‘కీడాకోలా’తో నవ్వులు పూయించాడు. ఇదిలా ఉంటే నేడు (నవంబర్ 5) తరుణ్ భాస్కర్ పుట్టినరోజు. 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
తరుణ్ భాస్కర్ 1988 నవంబరు 5న ఉదయ్ భాస్కర్, గీతా దంపతులకు చెన్నైలో పుట్టాడు. తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) తండ్రిది వరంగల్ కాగా, తల్లిది తిరుపతి. అలా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాడిగా తరుణ్‌ను చెప్పవచ్చు.
తన కొడుకు క్రియేటివ్ రంగంలో రాణించాలని తరుణ్ భాస్కర్ తండ్రి చిన్నప్పుడే కలలు కన్నారు. ఇందుకు అనుగుణంగా తరుణ్‌కు రెండేళ్ల వయసు ఉండగా ఆ రోజుల్లోనే రూ.300 పెట్టి కెమెరా కొని ఇచ్చారు. ఆ కెమెరా ఇప్పటికీ తరుణ్ భాస్కర్ దగ్గర ఉంది.
తరుణ్ భాస్కర్ తల్లి గీతా ప్రముఖ తెలుగు నటి. ఫిదా చిత్రంలో సాయిపల్లవికి తల్లిగా నటించింది. శ్రీరంగ నీతులు, సర్కారు వారి పాట, 118, అనుకోకుండా చిత్రాల్లోనూ ఆమె కనిపించింది.
తరుణ్ భాస్కర్ తల్లి గీతా గొప్ప కవియిత్రి. ఆమె తన జీవితంలో ఎన్నో కవితలు రాశారు. ఆమె రాసిన కవిత ఆధారంగానే తరుణ్ భాస్కర్ తన తొలి షార్ట్‌ఫిల్మ్ తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ఆ ఉత్సాహంతో వరుసగా ‘జర్నీ’, ‘మినిట్స్ టూ మిడ్నైట్’, ‘అనుకోకుండా’, ‘జూనూన్’, ‘సైన్మా’ మెుదలైన షార్ట్ ఫిల్మ్ చేశాడు. వీటిలో కొన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంఫాల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికై తరుణ్ భాస్కర్‌కు మరింత పేరు తీసుకొచ్చింది.
ముఖ్యంగా ‘జూనూన్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ కూడా వచ్చింది. అలాగే ‘అనుకోకుండా’ లఘు చిత్రం యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించింది. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతువర్మ ‘అనుకోకుండా’ షార్ట్ ఫిల్మ్‌లో నటించడం విశేషం.
తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) రూపొందించిన ‘సైన్మా’ షార్ట్ ఫిల్మ్ మంచు లక్ష్మీకి బాగా నచ్చింది. కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇందులో లీడ్ రోల్లో నటించడం గమనార్హం.
సైన్మా షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో కలిసి పనిచేద్దామని మంచు లక్ష్మీ తరుణ్‌కు ఆఫర్ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలోనే తరుణ్ భాస్కర్ తండ్రి చనిపోయారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఆ తర్వాత నిర్మాత రాజ్ కందుకూరును కలుసుకోవడం పెళ్లి చూపులు స్క్రిప్ట్ ఆయనకు బాగా నచ్చడం చకా చకా జరిగిపోయింది. అంతకుముందే మంచి పరిచయమున్న విజయ్ దేవరకొండ, రీతు వర్మను హీరో, హీరోయిన్గా తీసుకొని తరుణ్ భాస్కర్ మంచి సక్సెస్ అందుకున్నాడు.
2016లో రిలీజైన ‘పెళ్లి చూపులు’ (Pelli Chupulu).. ఉత్తమ తెలుగు చిత్రం, బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ డైలాగ్స్‌కు గాను జాతీయ పురస్కారాలు అందుకుంది.
మహానటి సినిమాలో దర్శకుడు సింగీతం శ్రీనివాస్ పాత్రను పోషించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు తరుణ్ భాస్కర్.
తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన లతా నాయర్‌ను 2013 నవంబర్ 20వ తేదీన పెళ్లి చేసుకున్నారు. తరుణ్ భాస్కర్ పుట్టిన రోజు, పెళ్లి రోజు నవంబర్లోనే ఉండటం విశేషం.
తరుణ్ భాస్కర్ భార్య లతా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తుంటారు. తన భర్త తీసిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలకు ఆమె పని చేశారు. అంతేకాదు సమంత నటించిన ‘యూ టర్న్’ మూవీకి కూడా వర్క్ చేశారు.
ఈటీవీలో ‘మీకు మాత్రమే చెప్తా’ షోకు హోస్ట్‌గా వ్యవహరించి తను ఏదైనా చేయగలగనని మరోమారు నిరూపించాడు తరుణ్ భాస్కర్.
తరుణ్ భాస్కర్ పుట్టిన రోజు (HBD Tarun Bhaskar) సందర్భంగా ఆయన కొత్త సినిమా పోస్టర్ రిలీజైంది. ఏ.ఆర్ సజీవ్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రంలో తరుణ్ ‘అంబటి ఓంకార్ నాయుడు’ పాత్రలో కనిపించనున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘జయ జయ జయ జయహే’ చిత్రానికి రీమేక్‌గా అది రానుంది. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రానికి ‘ఓం శాంతి శాంతి శాంతి’ టైటిల్ ఖరారు చేశారని తెలిసింది.