బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్’ (Animal). నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే సమయంలో అనేక విమర్శలను సైతం మూటగట్టుకుంది. తీవ్ర హింసతోపాటు పలు సీన్స్‌లో మహిళను తక్కువ చేసి చూపారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే తొలిసారి ఈ విమర్శలపై రణ్‌బీర్ కపూర్ స్పందించాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
‘అది నా బాధ్యత’
గోవా వేదికగా జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడారు. ‘యానిమల్ (Animal) విషయంలో అందరి అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావడం తమ బాధ్యతని రణ్‌బీర్ అన్నారు. అలాగే కొత్తదనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. నటీ నటులకు ఇది చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. నటులందరూ విభిన్నమైన పాత్రలు పోషించినప్పుడే కెరీర్ బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలను యానిమల్ సినిమా అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ మూవీ గురించి విమర్శించిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.
అలా చెప్పకుండా తప్పుచేశారా?
‘యానిమల్’ గురించి రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు పెదవి విరుస్తున్నారు. విమర్శకుల అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పడం తమకు నచ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు. అది ఓ రకంగా వారికి మద్దతు తెలియజేయడమేనని అభిప్రాయపడుతున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని రణ్‌బీర్ నేరుగా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అలా కాకుండా ‘కర్ర ఇరగొద్దు.. పాము చావొద్దు’ అన్న విధంగా రణ్‌బీర్ వ్యాఖ్యలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి కూడా కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు.
ఎనిమిది రోజులపాటు..
గోవాలోని పనాజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) (IFFI) వేడుకగా జరుగుతోంది. నవంబర్ 20న ప్రారంభమైన ఈ వేడుక నవంబర్ 28 వరకు జరగనుంది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. అయితే బాలీవుడ్ దిగ్గజాలను నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు రణ్‌బీర్ తన ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. దేశమంతా రాజ్‌కపూర్ సినిమాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. గొప్ప వాళ్లను నేటితరం మర్చిపోకుండా ఉండాలంటే వారి సినిమాల గురించి ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలన్నారు.
ఇద్దరూ బిజీ బిజీ
‘యానిమల్’తో సాలిడ్ విజయాన్ని అందుకున్న సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రస్తుతం ప్రభాస్ (Prabhas)తో ‘స్పిరిట్’ (Spirit)ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే నెల డిసెంబర్‌లో ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుంది. మరోవైపు ‘యానిమల్’ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ‘రామయణ’ (Ramayana) అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఇందులో రాముడిగా ఆయన చేస్తున్నారు. సీతగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్నారు. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని 2025 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.