ప్రస్తుతం ఓటీటీలో కొరియన్ డ్రామాలు, సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంది. అవి యునిక్ కాన్సెప్ట్‌తో అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో వస్తాయని చాలా మంచి పేరుంది. దీనికి తోడు ఆయా చిత్రాలు, సిరీస్‌ల కంటెంట్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని అంటుంటారు. అందుకే దేశవ్యాప్తంగా కొరియన్ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఆదరించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కాబట్టి ఈ వీకెండ్‌లో మంచి కొరియన్ సినిమా చూడాలని భావించే వారికి YouSay ఓ సినిమాను ఓటీటీ సజిషన్స్ రూపంలో తీసుకొచ్చింది. వైలెన్స్, థ్రిల్లర్, మర్డర్స్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఆ సినిమా పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆ మూవీ ఏదంటే?
ఓటీటీలో తప్పకచూడాల్సిన కొరియన్ చిత్రాల్లో ‘ఐ సా ది డెవిల్’ (I Saw The Devil) ముందు వరుసలో ఉంటుంది. 2010లో కొరియాలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. లీ బైంగ్-హమ్ (Lee Byung-Hun) కథానాయకుడిగా, చోయ్ మైనా-సిక్ (Choi Myna-Sik) ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాకు కిమ్ జీ-వూన్ (Kim Jee-woon) దర్శకత్వం వహించారు. 2 గం. 22 ని.ల నిడివితో డార్క్, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ రివేంజ్ సినిమా.. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
పెద్దలకు మాత్రమే!
ఒక సైకో కిల్లర్ మనస్తత్వం ఎలా ఉంటుందో దర్శకుడు కిమ్ జీ-వూన్ ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టాడు. పగలు సాధారణ మనుషుల్లాగే ఉంటూ రాత్రి అయితే ఎంత వైలెంట్‌గా మారతారో ఇందులో చూపించారు. ఆడవారిని కిల్లర్ హత్య చేయడాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించాడు దర్శకుడు. శరీర భాగాలను కట్ చేసి అందులో ఆనందాన్ని వెతుక్కోవడం వీక్షకులకు సైతం కోపం తెప్పిస్తుంది. అటువంటి కిల్లర్ చేతిలో తనకు ప్రాణానికి ప్రాణమైన యువతి మరణిస్తే ఆ హీరో రియాక్షన్ ఇంకెంత వైలెంట్‌గా మారుతుందో ప్రేక్షకులకు తెలియజేశాడు. అయితే ఇందులో బోల్డ్ కంటెంట్, క్రైమ్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు, ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు. ఒంటరిగా మాత్రమే చూడాల్సి ఉంటుంది.
కథేంటి?
ఓ సీరియల్ కిల్లర్ పగలు స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ రాత్రిళ్లు ఒంటరిగా కనిపించే ఆడ వారిని కిడ్నాప్ చేస్తుంటాడు. వారిని వివస్త్రలను చేసిన విచక్షణారహితంగా చంపుతుంటాడు. ఈ క్రమంలో ఓ NIS (The National Intelligence Service) ఏజెంట్ భార్య ఒంటరిగా కారులో వెళుతూ నిర్మానుష్య ప్రాంతంలో చిక్కుకుపోతుంది. కిల్లర్ గమనించి ఆమెపై దాడి చేస్తాడు. ఇంటికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు. ఈ ఘటనతో బాగా డిస్టర్బ్ అయిన హీరో.. విలన్ ఆచూకీ తెలుసుకుని అతడ్ని పట్టుకుంటాడు. అయితే చంపకుండా చిత్రహింసలు పెట్టి వదిలేస్తాడు. కిల్లర్ కడుపులో జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. అతడు ఎక్కడకు వెళ్తే అక్కడికి వెళ్లి నరకం చూపిస్తుంటాడు. తన బాడీలో జీపీఎస్ ఉందని గ్రహించిన కిల్లర్.. దాన్ని తీసివేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కిల్లర్ ఆచూకీని హీరో కనిపెట్టాడా? లేదా? అన్నది కథ.