నటీనటులు : శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, బేబీ చైత్ర, బేబీ లీషా, విజయలక్ష్మి, శ్రీలత, రవివర్మ, తదితరులు
దర్శకుడు : సాయికిరణ్ దైదా
సంగీతం : కృష్ణ సౌరభ్ సూరంపల్లి
సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
నిర్మాత : యశ్వంత్ దగ్గుమాటి
విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023
ఒకప్పుడు టాలీవుడ్‌లో హారర్ జానర్ చిత్రాలు ఎక్కువగా కనిపించేవి. ఇటీవల కాలంలో వాటి తాకిడి కాస్త తగ్గింది. అయితే ఆడపాదడపా ఈ జానర్‌ని స్పృశిస్తూ దర్శకనిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఈ కోవలో రూపొందిన చిత్రం ‘పిండం’ (Pindam). ‘ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్’ అనే ఉపశీర్షికతో సినిమా రూపుదిద్దుకుంది. ప్రచార చిత్రాలు సైతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
తాంత్రిక విద్యలో ఆరితేరిన అన్నమ్మ(ఈశ్వరి రావు)ను తన రీసెర్చ్ కోసం లోక్ నాథ్ (శ్రీనివాస్ అవసరాల) ఇంటర్వ్యూ చేస్తాడు. ఆమె కెరీర్ లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తాడు. అందుకు బదులిస్తూ 1990 దశకంలో సుక్లాపేట్‌లోని ఓ కుటుంబానికి జరిగిన ఘటనను ఆమె చెప్పుకొస్తుంది. ఆంటోనీ (శ్రీరామ్).. గర్భవతి భార్య మేరీ(ఖుషి రవి), తల్లి, తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత నుంచి ఇంట్లో అంతా అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని పీడిస్తుంది ఏంటి? అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా? దుష్టశక్తి నుంచి ఆ కుటుంబం ఎలా బయట పడింది? అన్నది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
శ్రీరామ్, ఖుషి రవి మధ్య తరగతి కుటుంబానికి చెందిన జంటగా ఇమిడిపోయారు. హారర్ సీన్లలో శ్రీరామ్ నటన ఆకట్టుకుంటుంది. ఖుషి రవి గర్భవతిగా, ఇద్దరు బిడ్డల తల్లిగా పాత్రకి తగ్గట్టుగా నటించింది. తాంత్రిక శక్తులున్న మహిళగా ఈశ్వరీరావు నటన మెప్పిస్తుంది. ఇద్దరు చిన్నారుల్లో తారగా నటించిన అమ్మాయి సైగలతో మాట్లాడుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అవసరాల శ్రీనివాస్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. రవివర్మ తదితరులు పాత్రల ప్రాధాన్యం మేరకు నటించారు
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు సాయికిరణ్ దైదా కథనంపైన, కథలోని భావోద్వేగాలపైన ఇంకొంచెం దృష్టిపెట్టాల్సింది. అయితే ఆంథోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించే సన్నివేశాల్ని భయం కలిగించేలా తీయడంలో ఆయన సఫలమయ్యాడు. కానీ, అవే సీన్లు పదే పదే పునరావృతం కావడంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత ఉండదు. విరామంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ సెకండ్ పార్ట్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కడుపులో పిండానికీ, బయటి ఆత్మకీ ముడిపెట్టడంలో పెద్దగా లాజిక్ కనిపించదు. ఓవరాల్‌గా సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి.
సాంకేతికంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. శబ్దాలతోనే భయపెట్టడంలో సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ సక్సెస్ అయ్యాడు. విష్ణు నాయర్ కళా ప్రతిభ తెరపై కనిపిస్తుంది. దర్శకుడు భయపెట్టే సన్నివేశాల్ని ఆయన బాగా డిజైన్ చేసుకున్నారు. నిర్మాణంపరంగా లోపాలేమీ లేవు.
ప్లస్ పాయింట్స్
- హారర్ సన్నివేశాలు
- నటీనటులు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- రొటిన్ కథ, కథనం
- కొరవడిన భావోద్వేగాలు