RRR చిత్రంలో నాటునాటు పాటకి ఆస్కార్ రావటం పట్ల చిత్రబృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి టీమ్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందలు తెలుపుతున్నారు. ప్రపంచస్థాయికి భారతీయ సినిమా వెళ్లిందంటూ ప్రశంసిస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్‌లపై పొగడ్తల వర్షం కురుస్తుంది.
RRR చిత్రబృందం ఆస్కార్ అందుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ నాటునాటు పాటకి ఆస్కార్‌తో దేశం గర్విస్తోంది. ఈ పాటను కొన్ని ఏళ్లతరబడి స్మరించుకుంటారు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు” అంటూ ప్రధాని కొనియాడారు.
బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో RRRలోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చిత్రబృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు వెంకయ్య.
దేశం మెుత్తం స్టెప్పులు వేసిన పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కీరవాణి, చంద్రబోస్ సహా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆస్కార్ గెలిచి ఆర్ఆర్‌ఆర్ చిత్రం చరిత్ర సృష్టించిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. భారతదేశ గర్వించ దగ్గ విషయం ఒకటైతే, తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతికి మరింత గర్వకారణంం అన్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి దార్శనికత, సాహసం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కారం అందుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ఇందులో చరణ్ కూడా భాగస్వామ్యం కావటం గర్వంగా ఉందన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు జనసేనాని పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. “ ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన RRRలోని ఈ నాటు నాటు… గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా హుషారెత్తించింది. ఈ గీతాన్ని ఆస్కార్ వేదికపై ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారత సినిమా స్థాయి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా చేసిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు” చెప్పారు.
ఆర్‌ఆర్‌ఆర్ బృందం భారతీయులను, తెలుగు సినిమాను గర్వించేలా చేసిందని తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రశంసించారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు తమిళిసై.
విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటుతూ.. ఆస్కార్ ను గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణమని చెప్పారు సీఎం.
ఆర్ఆర్‌ఆర్ ఆస్కార్ అందుకోవటంతో ఆనందంలో మునిగి తేలుతున్న వారిలో తాను కూడా చేరానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కీరవాణి, చంద్రబోస్‌తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.
RRR హీరోయిన్ అలియా భట్ నాటు నాటుకు ఆస్కార్ రావడం పట్ల తన సంతోషాన్ని ఇన్‌స్టా స్టోరీలో వ్యక్తపరిచింది. సెలబ్రేషన్ ఎమోజీలతో ఆనందాన్ని పంచుకుంది.
ఆస్కార్ అవార్డు గెలవటంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “ ఇప్పటికీ నాకు కలగానే ఉంది. మాకు అంతులేని మద్దతు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. రాజమౌళి, కీరవాణి భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప వ్యక్తులు. ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి కృతజ్ఞతలు. నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తుంపు పొందటానికి కారణమైన రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ, ప్రేమ్ రక్షిత్‌కు అభినందనలు. తారక్‌తో కలిసి మరోసారి డాన్స్ చేసి రికార్డులు బద్ధలుకొట్టాలని ఆశిస్తున్నాను. ఈ అవార్డు భారత చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క నటుడు, టెక్నిషియన్‌కు అంకితం” అన్నారు.
నాటు నాటు పాట ఆస్కార్ గెలవడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. మేము కూడా ఆస్కార్ సాధించాం అంటూ తన సంతోషాన్ని ట్వీట్ చేశారు. RRR మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, నాటు నాటు సాంగ్ రాసిన గేయ రచయిత చంద్రబోస్‌ను తారక్ అభినందించారు. మొత్తం RRR చిత్రబృందానికి ఆయన శుక్షాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి