• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • The Elephant Whisperers: ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఆస్కార్ అవార్డు.. భరతభూమికి అంకితం ఇచ్చిన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్

    ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ భారతీయ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించింది. భారత్ నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందిన తొలి డాక్యుమెంటరీ లఘు చిత్రం ఇదే కావడం విశేషం. 95వ ఆస్కార్ మహోత్సవంలో ఇతర భాషల లఘుచిత్రాలతో పోటీ పడి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది. 

    భరతభూమికి అంకితం..

    95వ ఆస్కార్ వేడుకలకు హాజరైన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్ వేదికపై అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డును జన్మభూమి భారత్‌కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రబృందానికి, కుటుంబానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్తికి గొన్సాల్వేస్ తల్లి ప్రిసిల్లా గొన్సాల్వేస్ ఈ సినిమాకు కథను అందించారు. 

    వీటితో పోటీ..

    హాలౌట్(Haulout), హౌ డు యు మెజర్ ఎ ఇయర్(How Do You Measure a Year?), ద మార్తా మిచెల్ ఎఫెక్ట్(The Martha Mitchell Effect), స్ట్రేంజర్ ఎట్ ద గేట్(Stranger at the Gate) చిత్రాలతో పోటీ పడి ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది. తమిళంలో తెరకెక్కిన ఈ లఘు చిత్రం 2022 డిసెంబర్ 8న విడుదలైంది. 

    కథేంటి..?

    ఏనుగు, ఓ కుటుంబం మధ్య ఏర్పడే అనుబంధం గురించి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ వివరిస్తుంది. బొమ్మన్, బెల్లి దంపతులు ‘రఘు’ అనే అనాథ ఏనుగును చిన్నప్పుడే దత్తత తీసుకుని అపురూపంగా పెంచుకుంటారు. గాయపడిన ‘రఘు’కు ఎన్నో సపర్యలు చేసి పెంచుకునే క్రమంలో బంధుత్వం ఏర్పడుతుంది. ఈ షార్ట్‌ఫిలిం ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అదే సమయంలో గిరిజనుల జీవన విధానం, పచ్చని అడవి అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి చిత్రం అయినప్పటికీ చాలా చక్కగా తీశారు డైరెక్టర్ కార్తికి.

    షార్ట్ ఫిలిం వెనక ఎంతో శ్రమ

    షార్ట్ ఫిలిం అయినప్పటికీ ఈ లఘుచిత్రాన్ని తీయడానికి డైరెక్టర్ కార్తికి అండ్ టీం ఎంతో శ్రమ పడ్డారు. ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ తీయడానికి దాదాపు ఐదేళ్లు పట్టిందని డైరెక్టర్ కార్తికి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మూడు నెలలు వయసు ఉన్నప్పుడే పిల్ల ఏనుగు ‘రఘు’ను కలిసినట్లు కార్తికి చెప్పారు. ఏడాదిన్నర పాటు ఈ ఏనుగుతో గడిపారట. తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో కొలువై ఉన్న ‘ముదుమలై నేషనల్ పార్క్’లో ఈ సినిమాను చిత్రీకరించారు. 

    నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..

    39 నిమిషాల నిడివితో కూడిన ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ కింద ఈ సినిమా తెరకెక్కింది. గునీత్ మొంగా ప్రొడ్యూస్ చేశారు. 

    మూడో చిత్రం.. 

    భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్న మూడో సినిమా ఇది. గతంలో రెండు లఘు చిత్రాలు ఆస్కార్‌కు పోటీపడ్డాయి. 1969లో ద హౌజ్ దట్ ఆనంద బిల్ట్(The House That Ananda Built), 1979లో యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్(An Encounter With Faces) నామినేషన్లు దక్కించుకున్నాయి. కానీ, అవార్డును పొందలేకపోయాయి. ద ఎలిఫెంట్ విస్పరర్స్ ఈ లోటును తీర్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    The Elephant Wisperers: ఆస్కార్ గెలిచేంత ఏముంది ఈ సినిమాలో?