తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని సైతం రూపొందిస్తుండటం విశేషం. అయితే ఈ డాక్యుమెంటరీకి కోలీవుడ్ స్టార్ ధనుష్ సమస్యలు సృష్టించినట్లు తెలుస్తోంది. ధనుష్ వల్లే డాక్యుమెంటరీ రిలీజ్ ఆలస్యమవుతోందని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్‌కు ఓ బహిరంగ లేఖ రాసిన నయనతార అందులో అతడిపై విరుచుకుపడింది. ఈ వ్యవహారం కోలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
2015లో నయనతార చేసిన ‘నానుమ్ రౌడీ’ (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నటిగా ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను అప్పట్లో ధనుష్ నిర్మించడం గమనార్హం. ప్రస్తుతం రూపొందుతున్న నయనతార డాక్యూమెంటరీ ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale)లో ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు, ఫొటోలు, వీడియోలను వినియోగించుకోవాలని నయనతార చాలా ఆశపడింది. ఇందుకోసం ధనుష్‌కు పలుమార్లు విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ధనుష్ ససేమీరా అన్నారట. దీంతో కెరీర్‌లో ఎంతో కీలకమైన సినిమాను తన డాక్యూమెంటరీలో చూపించలేకపోతుండటంతో నయనతార కోపం కట్టలు తెచ్చుకుంది. ధనుష్‌ను ఏకిపారేస్తూ బహిరంగ లేఖ రాసింది.
‘నా హృదయాన్ని ముక్కలు చేశారు’
నటుడు ధనుష్ (Nayanthara Vs Dhanush)పై రాసిన బహిరంగ లేఖలో నటి నయనతార బహిరంగ విమర్శలు చేశారు. ముఖ్యంగా ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీప్రియులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మా జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం. ఎన్‌వోసీ (NOC) కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్ చేస్తున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీస్ నన్ను షాక్‌కు గురిచేసింది. అందులో మూడు సెకన్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరం. ఇక్కడే మీ క్యారెక్టర్ ఏమిటనేది తెలిసిపోతుంది. దేవుడే దీనికి సమాధానం చెబుతాడు’ అని రాసుకొచ్చింది.
‘ఆసూయ పడకండి’
‘నానుమ్ రౌడీ’ సినిమాను (Nayanthara Vs Dhanush) ప్రస్తావిస్తూ మరిన్ని విషయాలను లేఖలో నయన్ పంచుకుంది. ‘సినిమా విజయం సాధించిన తర్వాత మీ అహం బాగా దెబ్బతిందని సినీవర్గాల నుంచి తెలుసుకున్నా. ఈ లేఖతో నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి. ఈ ప్రపంచం అందరిది. ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేని సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలో పైకి వచ్చినా తప్పు లేదు. ఈ విషయంలో కొన్ని కట్టుకథలు అల్లి, పంచ్ డైలాగులు చేర్చి తదుపరి ఆడియో విడుదలలో మీరు మాట్లాడవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఇతరుల స్టోరీల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చనే ఉద్దేశంతో మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం. మీరు కూడా దీనిని చూడండి. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అని నయనతార పేర్కొంది.
నవంబర్ 18న స్ట్రీమింగ్..
నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. నవంబరు 18న నెట్‌ఫ్లిక్ వేదికగా ఇది విడుదల కానుంది. ఇటీవల ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు స్టార్ హీరో నాగార్జునతో పాటు రానా, ఉపేంద్ర, రాధిక, డైరెక్టర్ అట్లీ వంటి వారు నయనతారతో తమకున్న బంధాన్ని, ఆమెపై ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార ఫిల్మ్ జర్నీతో పాటు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ఆమె ప్రేమ, పెళ్లి గురించి చూపించనున్నారు. ఇదిలా ఉంటే నయనతార – విఘ్నేష్ కలిసి తొలిసారి ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రానికి పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించగా చిత్ర నిర్మాత అయిన ధనుష్ దానికి అంగీకరించలేదు.
ఫుల్ స్వింగ్‌లో నయనతార
ప్రస్తుతం ఫిల్మ్ కెరీర్ పరంగా నయనతార (Nayanthara Vs Dhanush) దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది ‘అన్నపూర్ణి’గా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్ బిజీ బిజీగా ఉంది. తమిళంలో ‘టెస్ట్’, ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’, ‘తని ఓరువన్ 2’, ‘ముకుతి అమ్మన్ 2’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్ స్టూడెంట్స్’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్