వెస్టిండీస్‌తో సిరీస్‌లో అంతర్జాతీయ కెరీర్‌కి ఎంట్రీ ఇచ్చాడు తిలక్ వర్మ. గతేడాది నుంచి ఐపీఎల్లో స్థిరంగా రాణించడంతో సెలక్టర్ల కంట పడ్డాడు. దీంతో వెస్టిండీస్ సిరీస్‌కి తిలక్ ఎంపికయ్యాడు. అటు, ఐర్లాండ్‌తో 3 టీ20ల సిరీస్‌కి కూడా సెలక్ట్ అయ్యాడు. అయితే, చాలా మంది అరంగేట్ర సిరీస్‌లో కంగారు పడిపోతుంటారు. ఒత్తిడిలో గొప్పగా రాణించలేక పోతుంటారు. కా నీ, తిలక్ వర్మ ఇందుకు విరుద్ధం. వచ్చీ రావడంతోనే తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. వరుసగా 3 టీ20ల్లో సాధికారిక ఇన్నింగ్స్‌లు ఆడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో తిలక్‌కి టీమిండియాలో చోటు కన్ఫర్మ్ అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
నాలుగో స్థానం ఫిక్స్?
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంపై ఎప్పటి నుంచో అయోమయం నెలకొంది. ఈ స్థానంలో ఆడే సరైన ఆటగాడు టీమిండియాకు దొరకట్లేదు. కొన్ని సార్లు వివిధ ఆటగాళ్లతో ఆడించి చూశారు. మరికొన్ని సార్లు వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాళ్లను డిమోట్ చేసి ట్రై చేశారు. అయినా, ఆ స్థానంలో సరైన బ్యాట్స్‌మన్ కుదురుకోలేదు. ఇక, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చేశాడు మన తిలక్ వర్మ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున నాలుగో స్థానంలో బరిలోకి దిగి ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడదే స్థానంలో తిలక్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి 3 టీ20ల్లో 139 పరుగులు చేసి సిరీస్‌లోనే అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
వన్డేల్లోనూ చోటు..?
తిలక్ వర్మ ప్రదర్శన చూసిన మాజీలు అతడి ఇన్నింగ్స్‌ను కొనియాడుతున్నారు. మాజీ బ్యాటర్ అభినవ్ ముకుంద్ తిలక్‌పై ప్రశంసలు కురిపించాడు. తన పర్ఫార్మెన్స్తో మిగతా ఫార్మాట్లలో టీమిండియా ద్వారాలు తెరిచేలా చేస్తున్నాడని కొనియాడాడు. వన్డేల్లోనూ తిలక్ చోటు సంపాదిస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఛాన్స్ ఇస్తే వరల్డ్‌కప్ జట్టుతోనూ ఆడగలడని చెప్పాడు. వాస్తవానికి టీమిండియా వన్డే జట్టులోనూ అస్థిరత నెలకొంది. బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పష్టత కొరవడింది. గతంలో నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బాగానే రాణించినా గాయం తర్వాత ఇది ఖాళీ అయింది. దీంతో పలువురి ఆటగాళ్లను ప్రయత్నించి చూశారు. టీ20ల్లో ఇరగదీస్తున్న సూర్య సైతం వన్డేలో ఈ స్థానంలో ఆడలేక విఫలమయ్యాడు. దీంతో తిలక్‌ని ఎంపిక చేసే సూచనలను కొట్టిపారేయలేం.
లెఫ్ట్ హ్యాండర్స్ కొరత
జట్టుకి వైవిధ్యం సమకూర్చడంలో లెఫ్ట్ హ్యాండర్లు కీలక పాత్ర పోషిస్తారు. 2011 వరల్డ్‌కప్ జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండేవారు. కానీ, గత రెండేళ్ల నుంచి భారత్‌లో లెఫ్ట్ హ్యాండర్లు కరవయ్యారు. జట్టును ఈ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. ఈ క్రమంలో లెఫ్ట్ హ్యాండర్‌గా వచ్చిన తిలక్ జట్టుకు డైవర్సిటీ తీసుకొస్తాడు. టాప్ ఆర్డర్లో కనీసం ఒక్కరైనా ఎడమ చేతి వాటం బ్యాటర్ ఉండటం జట్టుకు కాస్త ఊరటనిస్తుంది.
డేరింగ్, డ్యాషింగ్
పరిస్థితులకు తగ్గట్టు ఆడటం తిలక్ వర్మ నైజం. ఈ విషయాన్ని తనతో ఆడిన సీనియర్లే చెబుతారు. మైదానంలో తిలక్ వర్మ స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉంటాడని సూర్యకుమార్ యాదవ్ కొనియాడాడు. భవిష్యత్తులో తిలక్ గొప్ప స్టార్‌గా ఎదుగుతాడని ప్రశంసించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం గతంలో తిలక్‌పై ప్రశంసలు కురిపించాడు. ధైర్యంగా, దూకుడుగా ఆడగల నైపుణ్యం తిలక్ సొంతమని కొనియాడాడు.
ప్రస్థానం సాగిందిలా..
గతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడీ హైదరాబాదీ బ్యాటర్. తొలి సీజన్లోనే 14 ఇన్నింగ్స్‌లు ఆడి 397 పరుగులు చేశాడు. ఇదే ఊపును ఈ ఏడాది కూడా కొనసాగించాడు. మొత్తంగా ఐపీఎల్లో 25 ఇన్నింగ్స్‌లు ఆడి 740 పరుగులు చేశాడు. 2002 నవంబర్ 8న తిలక్ వర్మ జన్మించాడు.