నాగచైతన్య సమంత గతేడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్తతో ఇద్దరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు వాళ్లు విడాకుల గురించి ప్రకటించి నెలలు గడుస్తున్నా, దీని మీద చర్చలు మాత్రం ఆగడం లేదు. వీరి గురించి రోజుకో వార్త బయటకొస్తుంది. అయితే తాజాగా సమంత తన పెళ్లి చీరను నాగచైతన్యకు తిరిగి ఇచ్చిందనే వార్తలు సోషల్‌మీడియాతోపాటు నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తను నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది.
అయితే ఇంతకూ సమంత ఆ చీరను నాగచైతన్యకు ఎందుకు ఇచ్చిందంటే, పెళ్లిరోజు ఆమె కట్టుకున్న చీర చైతన్య వాళ్ల అమ్మమ్మది. నిర్మాత రామా నాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరి పెళ్లి చీరను సమంత తన పెళ్లిరోజు కట్టుకుంది. ఆ చీరకు పెళ్లి కోసం సమంత డిజైనర్ క్రేశా బజాజ్ కాస్త మెరుగులు దిద్దింది. పెళ్లికి ఆమె ఆ చీర కట్టుకోవడం చూసి నాగచైతన్య కుటుంబ సభ్యులు చాలా గర్వపడ్డారట. సమంతది ఎంత మంచి మనసు అని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆ చీరను కూడా తిరిగి ఇచ్చేసింది. అయితే ఆ చీర దగ్గుబాటి ఫ్యామిలీకి సెంటిమెంట్. తిరిగి మళ్లీ ఆ ఇంట్లో జరిగే పెళ్లిళ్లకు ఆ చీర అవసరం ఉండొచ్చు కాబట్టి దాన్ని తిరిగి ఇవ్వాలని సమంత నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
విడాకుల ప్రకటనకు ముందే సమంత తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో అక్కినేని పేరును తీసేసింది. తర్వాత నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేసింది. ఇక ఇప్పుడు పెళ్లి చీరను కూడా తిరిగి ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విడాకుల తర్వాత సమంతకు అక్కినేని కుటుంబం రూ.200 కోట్ల భరణం ఇస్తామని చెప్పారట. కానీ ఆమె దాన్ని తిరస్కరించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. నాకు ఆ కుటుంబం నుంచి ఒక్క రూపాయి కూడా వద్దని ఆమె తెగేసి చెప్పిందట.
అయితే ఈ వ్యక్తిగత విషయాలను మీడియాకు ఎవరు లీక్ చేస్తున్నారో మాత్రం అర్థం కావడం లేదు. రేటింగ్ కోసం మీడియా ఇలాంటి వ్యక్తి గత విషయాలను వార్తలుగా ప్రచురించడం, డిబేట్లు పెట్టి మరి సమంత చీర తిరిగి ఇవ్వడం కరెక్టా కాదా అని చర్చలు జరిపినా ఆశ్ఛర్యపోనక్కర్లేదు.
విడాకుల ప్రకటించిన సమయంలోనే మాకు కాస్త ప్రైవసీ కావాలని తెలిపినప్పటికీ వారిని వదలకుండా రోజు ఏదో ఒక వార్త సృష్టిస్తున్నారు. ఇలాంటి వార్తలపై సమంత గతంలో కోర్టుకు కూడా వెళ్లింది. నాగార్జున కూడా రూమర్స్‌ను మీడియా వార్తలుగా రాయొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. అయినప్పటికీ సమంత-నాగచైతన్యల వ్యక్తిగత విషయాల గురించి వార్తలు రావడం మాత్రం ఆగడం లేదు.