ఆకాశ్ పూరీ హీరోగా నటించిన ‘చోర్ బజార్’ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటించింది. జార్జిరెడ్డి ఫేమ్ జీవన్‌రెడ్డి దీనికి దర్శకత్వం వహించాడు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు. మీరు టిక్కెట్ కొనుక్కొని థియేటర్‌కు వస్తే చాలు సినిమాను చూసి కచ్చితంగా ఎంజాయ్ చేస్తారంటూ ఆకాశ్ పూరీ చాలా నమ్మకంగా చెప్పాడు. మరి ఆ నమ్మకాన్ని సినిమా నిలబెట్టిందా ఎలా ఉంది స్టోరీ ఏంటి తెలుసుకుందాం
కథేంటంటే…
హైదరాబాద్‌లోని మ్యూజియం నుంచి 200 కోట్ల రూపాయల విలువైన నిజాం కాలం నాటి వజ్రాన్ని ఒక దొంగల ముఠా చోరీ చేస్తుంది. పోలీసులు దర్యాప్తులో ఆ వజ్రం చోర్ బజార్‌లో ఉందని తెలుసుకుంటారు. చోర్‌బజార్‌లో ఉండే దొంగ బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి) అతి వేగంగా కారు టైర్లను విప్పేసి గిన్నిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని కలలు కంటాడు. ఈ క్రమంలోనే అతను మూగ అమ్మాయి సిమ్రాన్ (గెహ్నా సిప్పీ)తో ప్రేమలో పడతాడు. పోగొట్టుకున్న వజ్రాన్ని తిరిగి పొంది తమ ప్రభుత్వ ప్రతిష్టను కాపాడాలని మంత్రి సునీల్ రెడ్డి (సునీల్) పోలీసులను ఆదేశిస్తాడు. బచ్చన్ సాబ్ కి డైమండ్ కి ఉన్న లింక్ ఏంటి? వజ్రం ఎవరికి దక్కుతుంది? తన ప్రేమను, లక్ష్యాన్ని ఎలా సాధించాడనేదే కథ.
విశ్లేషణ:
జార్జి రెడ్డి వంటి అద్భుతమైన సినిమాను తీసిన జీవన్‌రెడ్డి చోర్ బజార్ చేయడంతో అందరికీ సినిమాపై ఆసక్తి పెరిగింది. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా సాగే ఈ కథను తెరపై చూపించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. మొదటి నుంచి కథతో పాటు స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా మరీ ఓవర్‌గా అనిపిస్తాయి. హీరోయిన్‌తో ప్రేమ వ్యవహారంలో కూడా కొత్తదనం ఏమీ లేదు. సునీల్, సంపూర్ణేశ్ బాబు, జబర్థస్త్ కమెడియన్స్ కామెడీ చేసేందుకు ప్రయిత్నించినా అది అతకలేదు. కోర్టు సీన్లు మరీ లాజిక్ లేకుండా అనిపిస్తాయి. జీవన్ రెడ్డి అసలు ఇలాంటి సీన్స్ రాసుకున్నాండటే నమ్మశక్యం కాదు. హీరో డైలాగ్స్, యాక్షన్ వయసుకు మించి అతిగా చేస్తున్నట్లుగా అనిపిస్తాయి. సినిమా మొత్తం ఒక చోర్ బజార్ అనే సెట్‌లోనే జరుగుతుంది. నటీనటుల తెలంగాణ యాస ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
నటీనటులు:
ఆకాశ్ పూరీ నటనలో గత సినిమాలకు ఇప్పటికీ కాస్త పరిణితి వచ్చిందనే చెప్పుకోవాలి. గెహ్నా సిప్పి మూగ అమ్మాయిగా పాత్ర పరిధిమేరకు నటించింది. హీరో తల్లి క్యారెక్టర్ చేసిన సీనియర్ హీరోయిన్ అర్చన డ్యాన్స్‌లు వేస్తూ యాక్టివ్ రోల్‌లో కనిపించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చే పాత్ర కాదు. ఇక సునీల్, సంపూర్ణేశ్ బాబు , సుబ్బరాజు పాత్రలు సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి.
సాంకేతిక విషయాలు:
కథలో కొత్తదనం ఏమీ లేదు. జీవన్ రెడ్డి కమర్షియల్ సినిమా ఫార్ములాను సరిగ్గా ఉపయోగించుకోలేదు. సురేశ్ బొబ్బిలి అందించిన రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అన్వర్ అలీ కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్లుగా ఉన్నాయి.
బలాలు:
నటీనటులు
సినిమాటోగ్రఫీ
బలహీనతలు:
స్టోరీ
స్క్రీన్‌ప్లే
అనవసరమైన సన్నివేశాలు