ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అనౌన్స్ అవుతాయి కానీ అన్నీ తెరమీదకు రావు. రకరకాల కారణాలతో ఆగిపోతాయి. సీనియర్ హీరోల నుంచి నేటి తరం హీరోల వరకూ అందరి కెరీర్‌లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. కొన్ని సినిమాలు పూర్తిగా అటకెక్కితే కొన్ని మాత్రం వేరే హీరోలతో వస్తాయి. కొన్ని బ్లాక్ బస్టర్లు అవుతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాపులుగా మిగులుతాయి. ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ఇలాంటి సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
మెరుపు
అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడన్న వార్తతో అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘బంగారం’ సినిమా తీసిన దర్శకుడు ‘ధరణి’ ఈ సినిమా తెరకెక్కించాలనుకున్నాడు. మెగా సూపర్ గుడ్ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్‌లో మొదలుపెట్టిన ఈ సినిమా ఆ తర్వాత అటకెక్కింది. దీంతో అదే బ్యానర్‌లో రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమా చేశారు.
రామ్ చరణ్- కొరటాల శివ
రామ్ చరణ్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సింది కానీ స్క్రిప్ట్ సరిగా పూర్తి కాక ఈ సినిమా ఆగిపోయింది. అయితే కొరటాల శివతో రామ్ చరణ్ తప్పకుండా ఓ సినిమా చేస్తారని అంటుంటారు.
శ్రీమంతుడు
కొరటాల ‘శ్రీమంతుడు’ కథను కూడా రామ్ చరణ్‌కు వినిపించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మహేశ్ బాబుతో ఈ సినిమా తెరకెక్కించగా సూపర్ హిట్‌గా నిలిచింది. రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హీరోలు కూడా శ్రీమంతుడుకు నో చెప్పారు.
సూర్య s/o కృష్ణన్
తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ సూపర్ హిట్ మూవీ సూర్య s/o కృష్ణన్ కోసం మొదట రామ్ చరణ్‌ను సంప్రదించారట. కానీ అప్పటికే రాజమౌళి మగధీరతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా చేయలేకపోయారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. రామ్ చరణ్‌కు ‘మగధీర’ స్టార్ ఇమేజ్‌ను తీసుకురావడమే గాక అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
లీడర్
శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ డ్రామా ‘లీడర్’. రానా తెరంగేట్రం చేసిన ఈ సినిమా కూడా తొలుత రామ్ చరణ్ దగ్గరికే వెళ్లిందట. కానీ రామ్ చరణ్ ఈ కథను తిరస్కరించాడు.
డార్లింగ్
అప్పటిదాకా మాస్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్న ప్రభాస్‌ను అమ్మాయిలకు ‘డార్లింగ్’ను చేసిన సినిమా ఇది. కరుణాకర్ మార్క్ లవ్ స్టోరీ, GV ప్రకాశ్ కుమార్ సెన్సేషనల్ మ్యూజిక్‌తో ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇది కూడా రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఒకటి.
కృష్ణం వందే జగద్గురుమ్
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ప్రయోగాత్మక, కళా విలువలు ఉన్న సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ప్రయోగాత్మక సినిమాలకు పెట్టిన పేరు రానానే ఈ సినిమాలోనూ నటించాడు. తొలుత ఈ సినిమా రామ్ చరణ్ దగ్గరకు వెళ్లినా రిజెక్ట్ చేశాడట.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ RC15లో నటిస్తున్నాడు. సినిమా టైటిల్ కూడా ‘గేమ్ చేంజర్’గా ఫిక్స్ చేశారు. ఇది పక్కా శంకర్ స్టైల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. రామ్ చరణ్ ఇందులో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు.