యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయతీ’ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి విజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. కీరవాణి సంగీతం అందించాడు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ. దేవీ ప్రసాద్, దినేశ్ కుమార్, షాలినీ వంటివాళ్లు కీలక పాత్రల్లో కనిపించారు.
ఎప్పుడూ స్టేజీల మీద, టీవీలో గల గలా మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించే యాంకర్ సుమ కొత్త ప్రయోగం చేసింది. జయమ్మ పంచాయతీ సినిమాలో సీరియస్ పాత్రలో నటించింది. ఇండస్ట్రీలో సుమ అందరికీ పరిచయం కావడంతో పవన్ కళ్యాణ్, రాజమౌళి, రామ్ చరణ్, రాఘవేంద్ర రావు, నాగార్జున ఇలా పెద్ద స్టార్స్ అందరూ సినిమా ప్రమోషన్స్‌లో భాగమయ్యారు. అయితే సుమను ఎప్పుడు నవ్వుతూ చూసే ప్రేక్షకులు ఈ సినిమాలో ఆమెను ఈ పాత్రలో చూసి యాక్సెప్ట్ చేస్తారా? జయమ్మగా ఎలా నటించింది? ఇంతకీ కథేంటి? తెలుసుకుందాం.
కథేంటంటే..
శ్రీకాకాళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరిలో తన భర్త(దేవీ ప్రసాద్) ఇద్దరు ఆడపిల్లలతో జీవనం గడుపుతుంటుంది జయమ్మ(సుమ). ఉన్నంతలో సంతోషంగా కాలం గడుపుతున్న ఆమెకు అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చి పడుతుంది. తన భర్తకు గుండె జబ్బు వచ్చిందని తెలుసుకొని ఆపరేషన్ చేయించేందుకు డబ్బు కోసం కష్టపడుతుంటుంది. అప్పుడే తన కూతురు పుష్పవతి కావడంతో ఆ ఫంక్షన్ రోజున వచ్చిన చదివింపులతో ఆపరేషన్ చేయించవచ్చు అనుకుంటుంది. కానీ ఆపరేషన్‌కు సరిపడేంతగా డబ్బు సమకూరదు. దీంతో సుమ ఊరి వాళ్లమీద పంచాయతీ పెడుతుంది. ఆ పంచాయతీలో ఏం తేలింది. జయమ్మ భర్తను ఎలా కాపాడుకుంది అది వెండితెరపై చూడాల్సిందే
ఎవరెలా చేశారంటే..
సుమ జయమ్మ పాత్రలో నటించింది అని చెప్పడం కంటే జీవించింది అనే చెప్పాలి. ఎప్పుడు తన పంచులతో అలరించే సుమ సీరియస్ పాత్రలో కనిపించి కూడా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఇంత పూర్తి స్థాయి కథలో నటించడం ఇదే మొదటిసారి. ఆమెలో ఇంత మంచి నటి ఉందని ఈ మూవీతో అందరికీ తెలిసేలా చెప్పింది. ఇక జయమ్మ భర్తగా నటించిన దేవీ ప్రసాద్ పాత్రమేరకు నటించాడు. మిగతా వాళ్లు అందరూ కొత్త నటీనటులే కావడంతో ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా ఆ గ్రామంలోని ప్రజలేనేమో , మనమే అక్కడ ఉండి వాళ్ల కథను చూస్తున్నామేమో అనిపిస్తుంటుంది.
విశ్లేషణ
మొదటి భాగం మొత్తం ఆ గ్రామంలోని వాతావరణం, వ్యక్తులు, వ్యక్తిత్వాలు పరిచయం చేశాడు దర్శకుడు. జయమ్మకు పంచాయతీ పెట్టడంలో ఎటువంటి ఆశ్ఛర్యం లేదు అనే విధంగా ప్రేక్షకులకు ఒప్పించే ప్రయత్నం చేశాడు. రెండో భాగంలో కథను కాస్త సాగదీసినట్లుగా అనిపించినా పంచాయతీలో జరిగే ఆసక్తికర సంఘటనలతో గడిచిపోతుంది. శ్రీకాకుళంకి చెందిన డైరెక్టర్ తమ యాస, భాషలన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
సాంకేతిక అంశాలు
మొదటి సినిమాతోనే రచయితగా, దర్శకుడిగా విజయ్ కుమార్ మంచి ప్రతిభను కనబరిచాడు. కీరవాణి సంగీతం సినిమాకు బలం చేకూర్చింది. సినిమాటోగ్రాఫర్ అనూష్ కుమార్ పల్లెటూరి వాతావరణాన్ని చాలా చక్కగా కెమెరాలో బంధించాడు. ఎడిటర్ రెండో భాగంలో కాస్త కత్తెరకు పనిచెప్పాల్సింది. ఏదేమైనప్పటికీ సుమ టీవీలోనే కాదు వెండితెరపై కనిపించినప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఈ సినిమా రుజువు చేసింది.
రేటింగ్ 2.5/5
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!