• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Major Movie Review

    అడివిశేష్ హీరోగా న‌టించిన మేజ‌ర్ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇప్ప‌టికే ప్రీ-రిలీజ్ స్క్రీనింగ్ జ‌ర‌గ‌డంతో దేశ‌వ్యాప్తంగా సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూలు వ‌స్తున్నాయి. మేజ‌ర్ ఫ‌లితంపై అడివి శేష్‌తో పాటు చిత్ర‌బృందం చాలా న‌మ్మ‌కంగా ఉంది. దీంతో పాటు ఇది ఒక అమ‌ర‌వీరుడి క‌థ కావ‌డంతో అంద‌రికీ ఆసక్తి పెరిగింది. మ‌రి మూవీ ఎలా ఉంది, ఎవ‌రెలా న‌టించారు తెలుసుకుందాం. 

    ముంబ‌యిలో 26/11 టెర్ర‌రిస్ట్‌ల అటాక్‌లో మ‌ర‌ణించిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ బ‌యోపిక్‌గా మేజ‌ర్ తెర‌కెక్కింది. ఇందులో మేజ‌ర్ బాల్యం, ఆర్మీలో చేరేందుకు ఎలా స్పూర్తి పొందాడు, త‌ల్లిదండ్రులు ఎలా స్పందించారు, ప్రేమ‌, పెళ్లి త‌ర్వాత ఎన్ఎస్‌జీ ట్రైనింగ్ ఆఫీస‌ర్ స్థాయికి ఎలా చేరాడు. ఉగ్ర‌దాడిలో ప్ర‌జ‌ల‌ను కాపాడుతూ చివ‌ర‌గా ఎలా మ‌ర‌ణించాడు. ఇలా ఆయ‌న జీవితంలో జ‌రిగిన ముఖ్య‌మైన ఘ‌ట‌న‌లు అన్నింటిని చూపించారు. 

    విశ్లేష‌ణ‌:

    మేజ‌ర్ మూవీలో కేవ‌లం సందీప్ ప్ర‌జ‌ల కోసం త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎలా పోరాడాడో చెప్ప‌డం కాకుండా చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న జీవితాన్ని తెర‌పై చూపించారు. గ‌తంలో ఈ ఉగ్ర‌దాడికి సంబంధించి చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వ‌చ్చాయి. కానీ ఇది అన్నింటి కంటే భిన్నంగా ఉంటుంది. చిన్న‌ప్ప‌టి నుంచి ఆ డ్రెస్ అంటే సందీప్‌కు ఎందుకంత ఇష్టం ఏర్ప‌డింది. ఆర్మీలో చేర‌తాన‌ని చెప్తే తల్లిదండ్రులు అభ్యంత‌రం చెప్ప‌డం, బాల్యం నుంచే త‌న గురించి ఆలోచించ‌కుండా ఇత‌రుల‌కు సాయం చేసే గుణం మొత్తాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి క‌థ‌పై మ‌రింత ఆస‌క్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్ అక్క‌డి నుంచి పుంజుకుంటుంది. మొత్తం తాజ్ హోట‌ల్ ఆప‌రేష‌న్ గురించి ఉంటుంది. ఇక ప్రీ-క్లైమాక్స్ , క్లైమాక్స్ తెర‌పై చాలా చ‌క్క‌గా చూపించారు. క్లైమాక్స్‌లో సందీప్ తండ్రి చెప్పేమాట‌లు ప్ర‌తి ఒక్క‌రి చేత క‌న్నీళ్లు పెట్టిస్తాయి. ఈ సినిమా మేజ‌ర్‌ సందీప్‌కు మంచి ట్రిబ్యూట్ అని చెప్ప‌వ‌చ్చు. మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ త్యాగం ప్రేక్ష‌కుల హృద‌యాలు బ‌రువెక్కించేలా ఉంటుంది.  

    ఎవ‌రెలా చేశారంటే..

    మేజ‌ర్ మూవీకి న‌టీన‌టుల ఎంపిక చాలా పెద్ద బ‌లంగా మారింది. అంద‌రూ వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఇమిడిపోయారు. సినిమా చూస్తున్నంత సేపు సందీప్‌నే తెర‌పై చూస్తున్నాం అనేంత‌గా క‌థ‌లో జీవించాడు అడివిశేష్‌. ఆ క్యారెక్ట‌ర్‌ను ఆయ‌న సొంతం చేసుకున్న విధానం తెర‌పై క‌నిపిస్తుంది. సందీప్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌గా న‌టించిన స‌యీ మంజ్రేక‌ర్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌గా, భార్య‌గా చ‌క్క‌గా న‌టించింది. పాత్ర ప‌రిధి త‌క్కువే అయిన‌ప్ప‌టికీ ఉన్నంత‌లో మంచి అభిన‌యం క‌నిపించింది. ఇక శోభితా దూలిపాళ్ల ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించి, ఆమె పాత్ర‌కు న్యాయం చేసింది. సందీప్ త‌ల్లిదండ్రులుగా ప్ర‌కాశ్‌రాజ్, రేవ‌తి క‌నిపించారు. ముఖ్యంగా ప్ర‌కాశ్‌రాజ్‌కు చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి తండ్రి పాత్ర ల‌భించింది. క‌మాండ‌ర్‌గా ముర‌ళీశ‌ర్మ‌, హోట‌ల్ మేనేజ‌ర్‌గా అనీశ్ వాళ్ల పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

    సాంకేతిక విష‌యాలు:

    మేజ‌ర్‌ క‌థ‌, స్క్రీన్‌ప్లే అడ‌విశేష్ అద్భుతంగా రాశాడు. అబ్బూరి ర‌వి డైలాగ్స్ బాగున్నాయి. వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ముఖ్యంగా తాజ్ హోట‌ల్‌ను చూపించిన విధానం ఆక‌ట్టుకుంటుంది . శ్రీ చ‌ర‌ణ్ పాకాల ఇచ్చిన సాంగ్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రేక్ష‌కులు క‌థ‌లో లీన‌మ‌య్యేలా చేసింది. ఎడిటింగ్ స్మార్ట్‌గా ఉంది. జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సోనీ పిక్చ‌ర్స్‌, ఏ ప్ల‌స్ ఎస్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి, నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన సినిమాల్లో బెస్ట్ మూవీగా మేజ‌ర్ నిలుస్తుంది.

    బ‌లాలు:

    న‌టీన‌టులు

    టెక్నిక‌ల్ విష‌యాలు

    సెకండాఫ్

    డైలాగ్స్

    బ‌ల‌హీన‌త‌లు:

    మొద‌టి భాగం కాస్త నెమ్మ‌దిగా ఉండ‌టం

    ఆల‌స్యంగా క‌థ‌లోకి తీసుకెళ్ల‌డం

    రేటింగ్: 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv