చైనాకు చెందిన ప్రముఖ టెక్ బ్రాండ్లలో వన్‌ప్లస్ (OnePlus) ఒకటి. ఈ ఏడాది ప్రారంభంలోనే OnePlus తన తొలి టాబ్లెట్ వన్‌ప్లస్ పాడ్ (OnePlus Pad) పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా మరో టాబ్లెట్‌ను సైతం భారత మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ‘వన్‌ప్లస్ పాడ్ గో’ (OnePlus Pad Go) పేరుతో త్వరలోనే కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేయనున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఆ ట్యాబ్‌కు సంబంధించిన ఫీచర్లను సైతం రివీల్ చేశాయి.
వన్ ప్లస్ పాడ్ గో(OnePlus Pad Go)కు సంబంధించిన వివరాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్సైట్లో సైతం కనిపించాయి. మోడల్ నంబర్ OPD2304 / OPD2305తో ఇవి కనిపించాయి. అంతేకాకుండా వన్ నార్మల్ యూజర్ నేమ్ అనే ట్విటర్ వినియోగదారుడు కూడా వన్ ప్లస్ పాడ్ గో ‘OPD2304’ గురించి సమాచారం అందించారు. అయితే తరువాత వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. అయితే దీని ఫీచర్స్ గురించి కానీ, ధర గురించి కానీ ఎలాంటి సమాచారం తెలియలేదు.
వన్ ప్లస్ పాడ్ గో వివరాలు తెలియకపోవడంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న OnePlus Pad అప్‌గ్రేడ్ వెర్షన్‌గా దీన్ని భావిస్తున్నారు. చిన్న చిన్న మార్పులు మినహా ఇంచు మించు అదే ఫీచర్లతో సెకండ్ ట్యాబ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు OnePlus Pad ఫీచర్లు, ధర ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.
బిగ్ డిస్ప్లే
OnePlus Pad.. 11.61 అంగుళాల డిస్ప్లేతో పాటూ 9,510mAh బ్యాటరీ, డైమెన్సిటీ 9000 చిప్సెట్, సన్నని డిజైన్‌తో తీసుకొచ్చారు. ఈ టాబ్లెట్ బరువు 550 గ్రాములు ఉంది. థిక్నెస్ అంతా కలిపి 0.65 సెంటీమీటర్లే ఉంది.
కెమెరా క్వాలిటీ
OnePlus Padలో EISకి మద్దతు ఇచ్చే 13MP బ్యాక్ కెమెరా ఉంది. దీని ద్వారా 30fps వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీలు లేదా వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు.
ధర ఎంతంటే?
ఈ ప్యాడ్.. 2 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. స్టార్టింగ్ మోడల్ ధర రూ.37,999 ఉండగా, హైఎండ్ వెర్షన్ ధర రూ.39,999 ఉంది. ఈ ప్యాడ్ హాలో గ్రీన్ కలర్ ఆప్షన్‌తో ఉంది.