భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఓటీటీ (OTT) యుగం నడుస్తోంది. మెున్నటి వరకూ ఎంటర్టైన్మెంట్ వేదికలుగా ఉన్న థియేటర్ల స్థానాన్ని ఓటీటీలు ఆక్రమించేశాయి. బడా హీరోల చిత్రాలు మినహా.. అత్యధిక శాతం చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), నెట్‌ఫ్లిక్స్ (Netflix), డిస్నీ+హాట్‌స్టార్ (Disney + Hotstar), సోనీలివ్ (SonyLIV), ఈటీవీ విన్ (ETV Win), వూట్ (Voot), ఆహా (Aha) వంటి ఓటీటీ వేదికలు కొత్త సినిమాలు – సిరీస్‌లు విడుదల చేస్తూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సొంతంగా ఒక ఓటీటీ యాప్‌ను తయారు చేయడానికి సిద్ధమయ్యింది. మార్చి 7న ఈ యాప్‌ను లాంచ్ చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
ఓటీటీ ఏర్పాటుకు కారణం ఇదే!
మలయాళం నుంచి వచ్చే చిత్రాలకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కంటెంట్ ఉన్న కథలను మాలీవుడ్ నిర్మిస్తుందన్న పేరు ఉంది. మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు.. ఇప్పటికే ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్నాయి. కొందరైతే సబ్‌టైటిల్స్ పెట్టుకొని మరి మాలీవుడ్ సినిమాలను వీక్షిస్తున్నారు. ఇది గమనించిన కేరళ ప్రభుత్వం.. డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. ‘సీస్పేస్’ (CSpace) పేరుతో కొత్త ఓటీటీ యాప్‌ను మూవీ లవర్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ యాప్‌లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని అంటున్నారు.
60 మంది ఉద్యోగులతో..
కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) రేపు స్వయంగా ‘సీస్పేస్’ (CSpace) యాప్‌ను లాంచ్ చేస్తారు. ఉదయం 9.30 గంటలకు.. కైరళి థియేటర్లో జరగనున్న లాంచ్ ఈవెంట్లో దీనిని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సజీ చెరియన్ (Saji Cherian) కూడా హాజరవుతారు. ఓటీటీ సెక్టార్ విషయంలో ఎదురవుతున్న సమస్యలకు ‘సీస్పెస్’ ఒక పరిష్కారాన్ని ఇస్తుందని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – KSFDC (Kerala State Film Development Corporation) చైర్మన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న KSFDCనే ఈ ‘సీస్పేస్’ యాప్‌ను రన్ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ యాప్‌లో పనిచేయడం కోసం కల్చరల్స్‌పై అవగాహన ఉన్న 60 మంది సిబ్బందిని సెలక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
ప్రత్యేక పానెల్ ఏర్పాటు!
ఈ ‘సీస్పేస్’ ఓటీటీలో ఎటువంటి కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలో నిర్ణయించేందుకు ఓ ప్రత్యేక ప్యానెల్‌ను సైతం KSFDC సంస్థ ఏర్పాటు చేసింది. బెన్యమిన్, ఓవీ ఉషా, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్, జియో బేబీ వంటి సీనియర్లతో ఈ ప్యానెల్ ఏర్పాటైంది. వీరంతా కలిసి ‘సీస్పేస్’ యాప్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈ యాప్‌లో ఎలాంటి సమాచారం స్ట్రీమ్ అవ్వాలి అనేది పూర్తిగా ఈ ప్యానెల్ చేతుల్లోనే ఉండనుంది. సీస్పేస్ లాంచ్ సందర్భంగా ఇప్పటికే మొదటి ఫేజ్‌లో భాగంగా 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్ సెలక్ట్ చేశామని, లాంచ్ అవ్వగానే అవి స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటాయని KSFDC డైరెక్టర్ కరుణ్ తెలిపారు.
‘సీస్పేస్’ ఎలా పనిచేస్తుంది?
‘సీస్పేస్’ యాప్‌ను మాస, త్రైమాసిక, వార్షిక చెల్లింపుల విధానంలో కాకుండా ‘పే పర్ వ్యూ‘ (Pay Per View) స్కీమ్‌తో రన్ చేయనున్నారు. ఇందులో సినిమా చూడాలంటే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అలా వచ్చిన సొమ్మును చిత్ర నిర్మాతలకు సీస్పేస్ ప్యానెల్ అందజేస్తుంది. ఒకవేళ తక్కువ నిడివి ఉన్న కంటెంట్ వస్తే సగం ధరకే వీక్షించే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా సినిమాలు ఏమీ అందుబాటులోకి రావడం లేదని, త్వరలోనే అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని KSFDC డైరెక్టర్ కరుణ్ తెలిపారు.
‘సీస్పేస్’తో ఎవరికి లాభం!
కేరళలో చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. దీనివల్ల లాభాలు తగ్గుతున్నాయని పలువురు ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ సమస్యకు సీస్పేస్ చెక్ పెట్టనుంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే ఈ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు KSFDC డైరెక్టర్ కరుణ్ తెలిపారు. అలాగే థియేటర్లు దొరక్క సమస్యలు ఎదుర్కొనే నూతన దర్శకులు తమ చిత్రాలను సీస్పేస్‌లో రిలీజ్ చేసుకోవచ్చని సూచించారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చని తెలియజేశారు. అటు ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు.